ప్రశాంతమైన రాష్ట్రంలో మత చిచ్చు రగిలిస్తున్నారని, ఓటు బ్యాంకు రాజకీయాల కోసం రాష్ట్రాన్ని తగలబెడుతున్నారని తెదేపా అధినేత చంద్రబాబు మండిపడ్డారు. ఓటు బ్యాంకు రాజకీయమే తప్ప ఏ మతంపైనా సీఎం జగన్‌కు విశ్వాసం లేదని ఆయన ఆరోపించారు.
తెదేపా సీనియర్ నేతలతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో చంద్రబాబు మాట్లాడుతూ... ‘‘రాష్ట్రంలో 100 రోజులుగా దేవాలయాలపై దాడులు జరగని రోజు లేదు. రథాలకు నిప్పు, విగ్రహాల ధ్వంసం, ఆలయాల్లో అరాచకాలు గతంలో ఎన్నడూ లేవు.
ఏ ఆలయంపై దాడి జరిగినా ప్రతిఒక్కరూ ఖండించాలి. ఏ మతం విశ్వాసాన్ని దెబ్బతీసినా ప్రతిఒక్కరూ గర్హించాలి.
ఇన్ని దేవాలయాలపై దాడులు జరుగుతోన్నా సీఎం జగన్మోహన్ రెడ్డి నోరు తెరవడు..? మంత్రులను ఉసిగొల్పి ఆలయాలపై అవాకులు చవాకులు మాట్లాడిస్తారా..? బొమ్మ చెయ్యి విరగ్గొడితే నష్టం ఏమిటని అంటారా..? రథం తగులపడితే ఇంకో రథం తయారీ చేయిస్తాం అంటారా..?
వెండి సింహాల ఖరీదు ఐదారు లక్షల రూపాయలే అంటారా..? ఇది తప్పని వైసిపిలో చెప్పేవాళ్లే లేరు. బూతులు తిడితే శభాష్ అంటారు. దళితులపై దాడులను ప్రోత్సహిస్తారు, దేవాలయాలపై దాడులను ఖండించరు.
దేనికీ జగన్మోహన్ రెడ్డి ఎందుకని స్పందించరు..? స్పందనలేని ముఖ్యమంత్రి ఎక్కడైనా ఉన్నాడా..? ఆలయాలపై దాడులపై నోరు తెరవడు, దళితులపై దాడులపై నోరు విప్పడు, బిసిలపై తప్పుడు కేసులను ఖండించడు, గిరిజనులు, ముస్లింలపై దౌర్జన్యాలను అడ్డుకోడు..
దేవాలయాలపై వరుస దాడుల వెనుక దురుద్దేశం స్పష్టంగా తెలుస్తోంది. 100దాడులు జరిగినా సీఎం పట్టించుకోవడం లేదు. దాడి జరిగిన ఏ ఒక్క ఆలయ ప్రాంతమైనా సీఎం జగన్ సందర్శించారా..? భక్తులకు భరోసా ఇచ్చారా..? నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారా..?
మంత్రుల వ్యాఖ్యలకు సాధువులు కంటతడి పెట్టే దుస్థితి తెచ్చారు. ప్రశాంతమైన రాష్ట్రంలో మతచిచ్చు రగిలిస్తున్నారు. ఓటుబ్యాంకు రాజకీయాల కోసం రాష్ట్రాన్ని తగులబెట్టాలని చూస్తున్నారు.
ఎన్నికలకు ముందు ఓట్ల కోసం హిందూ మతం స్వీకరించినట్లు డ్రామాలు ఆడారు, గెలిచాక బైబిల్ పక్కన పెట్టుకుని ప్రమాణ స్వీకారం చేశారు. ఓటు బ్యాంకు రాజకీయమే తప్ప దేనిపైనా విశ్వాసం లేదు.
ముఖ్యమంత్రి ఏ మతస్థుడైనా కావచ్చు, అన్ని మతాలను సమదృష్టితో చూడాలి, అన్ని ప్రార్ధనా మందిరాలను కాపాడాల్సిన బాధ్యత ముఖ్యమంత్రిపై ఉంది.
‘‘నా ఇష్టం వచ్చింది చేస్తా, నన్నేమీ చేయలేరనే’’ విచ్చలవిడి స్వభావాన్ని నేరగాళ్లలో మరింత పెంచేలా జగన్మోహన్ రెడ్డి ప్రవర్తిస్తున్నారు. రాష్ట్రంలో అరాచకాలు అన్నింటి వెనుక జగన్మోహన్ రెడ్డి హస్తం ఉంది. ఆంధ్రప్రదేశ్ ను ఆటవిక రాజ్యంగా చేస్తున్నారు.
మత హింస అనేది 13జిల్లాల ఏపి చరిత్రలో లేదు. పరమత సహనం పాటించే రాష్ట్రంలో మత విద్వేషాలు రగిలిస్తే చరిత్ర క్షమించదు. తెలుగుదేశం సెక్యులర్ పార్టీ. ఆలయాలపై దాడులను, మత విద్వేషాలు రెచ్చగొట్టడాన్ని సహించదు. టిడిపికి ముందు హైదరాబాద్ ను కర్ఫ్యూసిటిగా అనేవారు, అలాంటి నగరంలో అసలు కర్ఫ్యూ అనేదే లేకుండా చేశాం, మత సామరస్యాన్ని పెంపొందించాం.
2) ఫ్రాడ్స్ పార్టీ వైసిపి, ఫేక్ పార్టీ వైసిపి. బ్లాక్ మెయిలింగ్ లో, మానిప్యులేషన్ లో నిష్ణాతులు.
రాజధాని అమరావతిపై ఏ ఒక్క రైతు ఆరోపణ చేయలేదు. ఎటువంటి చిన్నతప్పు జరగలేదు. అలాంటిది అమరావతిలో అవినీతి జరిగిందని దుష్ప్రచారం చేశారు. ప్రత్యేక హోదాపై, ఎంఎస్ పిపై వైసిపి ఎంపిలు నోరు తెరవరు. టిడిపిపై కక్ష సాధింపే లక్ష్యంగా వైసిపి పెట్టుకుంది.
ఫైబర్ గ్రిడ్ పై రూ770కోట్లు ఖర్చుచేస్తే రూ 2వేల కోట్ల అవినీతి జరిగిందా..? ఇంతకన్నా దిగజారుడుతనం, దివాలాకోరుతనం ఉన్నాయా..? తప్పుడు వార్తలు, అక్రమ కేసుల్లో వైసిపి ఆరితేరింది. బెస్ట్ ప్రాజెక్టు ఫైబర్ గ్రిడ్ ను నాశనం చేశారు. రూ149కే కేబుల్, నెట్, ఫోన్ కనెక్షన్ ఇచ్చాం. లోకేష్ పై దుష్ప్రచారం చేస్తున్నారు. పార్లమెంటు ప్రాంగణంలో వైసిపి ఎంపిల ధర్నా సిగ్గుచేటు. అన్యాయంగా అచ్చెన్నాయుడిని 80రోజులు జైలుకు పంపారు. సాక్ష్యాధారాలు ఉన్నా మంత్రి జయరామ్ పై చర్యలు లేవు.
3) వైసిపి నీతులు ఇతరులకు చెప్పడానికే తప్ప ఆచరించడానికి కాదు.
ప్రలోభాలు పెట్టి ఒకరిద్దరిని లాక్కున్నంత మాత్రాన టిడిపికి నష్టం ఏమీ లేదు. ఒకరు పోతే వందమందిని తయారుచేసే సత్తా టిడిపికి ఉంది.
13జూన్ 2019న ఫిరాయింపులపై అసెంబ్లీలో జగన్ వ్యాఖ్యలు: '' టిడిపినుంచి మేము ఎవరినైనా తీసుకుంటే, వారిని ఖచ్చితంగా రాజీనామా చేయించిన తరువాతే తీసుకుంటామని గట్టిగా చెబుతున్నాము. అలాంటిది ఏమైనా పొరపాటున జరిగితే వెంటనే డిస్ క్వాలిఫై చేయండని మీకు విన్నవిస్తున్నాను. ఇటువంటి గొప్పగొప్ప ప్రాక్టీసులన్నీ మళ్లీ శాసనసభకు వస్తాయని సంపూర్ణంగా నమ్ముతూ, మీరు ఆ పని చేయగలుగుతారని సంపూర్ణంగా ఆశిస్తున్నాను, ఆల్ ది బెస్ట్'' అని జగన్ అసెంబ్లీలో వ్యాఖ్యానించారు.
అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారామ్ వ్యాఖ్యలు: ''ఇప్పుడు పెద్దలు చాలామంది మోరల్స్ గురించి, యాంటి డిఫెక్షన్ లా గురించి చెప్పారు. దానికి ఒక కంక్లూజన్ ఎక్కడో ఒక దగ్గర రావాలి. సభానాయకుడు మేము ఫిరాయింపులను ప్రోత్సహించం అని ఒకమాట అన్నారు. ఐయామ్ వెరీ హ్యాపి. ఒకవేళ ఎవరైనా సరే అలాంటి పరిస్థితే వస్తే, రాజీనామా చేసివచ్చి గెలిచి మరలా రావాలన్నదే ఆకాంక్ష’’గా తమ్మినేని సీతారామ్ అన్నారు.
జగన్ రెడ్డి చెప్పిన రాజీనామాలు ఏమయ్యాయి..? ఖచ్చితంగా రాజీనామా చేయించిన తర్వాతే తీసుకుంటామన్న మీ మాట ఏమైంది. ? అసెంబ్లీ సాక్షిగా చెప్పిన మోరల్స్ ఏమయ్యాయి..? స్పీకర్ ఆకాంక్షలు ఏమయ్యాయి.. ? ప్రజలు అన్నింటినీ గమనిస్తున్నారు.
4) నాపై గతంలో 26 విచారణలు చేయించారు, 14సభా సంఘాలు, 3 ఉపసంఘాలు, 4జ్యుడిసియల్ ఎంక్వైరీలు, 1సిబిసిఐడి విచారణ వేశారు, ఏ ఒక్క ఆరోపణ రుజువు చేయలేక పోయారు. ఇప్పుడు మళ్లీ గత 16నెలలుగా అదే చేస్తున్నారు. మనం ఏ తప్పు చేయలేదు, ఎవరికి భయపడాల్సిన పనిలేదు.
సమాజంలో ఎవరే తప్పు చేసినా కరెక్ట్ చేసేది కోర్టులు-న్యాయవ్యవస్థను ఎవరూ తప్పు పట్టరు. అలాంటి పవిత్ర న్యాయమూర్తులపై, కోర్టులపై వైసిపి బురద జల్లడం హేయం. తనపై(జగన్) విచారణ వేగవంతం అవుతుంది, ఏడాదిలో విచారణ పూర్తి చేస్తారనే అక్కసుతోనే కోర్టులను టార్గెట్ చేస్తున్నారు.
5) రాష్ట్రంలో 40ఏళ్లుగా లేనిది మళ్లీ రైతుల పంపు సెట్లకు మీటర్లు పెడుతున్నారు. ప్రయోగాత్మకంగా ఒక జిల్లాలోనే అని నమ్మించి అన్నిచోట్ల పెడుతున్నారు. రైతులపై తప్పుడు కేసులు పెడుతున్నారు. మీటర్ల ఏర్పాటును ప్రతిఘటించాలి, రైతులకు అండగా ఉండాలి.
మద్దతు ధరలేక రైతులు వేలకోట్ల నష్టపోయారు. వరి ఎంఎస్ పి పెంచకపోయినా వైసిపి ఎంపిలు నోరు తెరవరు. ప్రత్యేక హోదాపై, విభజన చట్టంలో అంశాల గురించి ప్రశ్నించరు. టిడిపిపై కక్ష సాధింపే తప్ప ప్రజా ప్రయోజనాలు, రాష్ట్ర శ్రేయస్సుపై దృష్టి లేదు.
6) టిడిపి నాయకులు, కార్యకర్తలు మొత్తం ఒక బృందంగా ఏకతాటిపై పని చేయాలి. ప్రజా సమస్యలపై ఎప్పటికప్పుడు స్పందించాలి. వైసిపి బాధితులకు అండగా ఉండాలి. సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని’’ వీడియో కాన్ఫరెన్స్ లో చంద్రబాబు దిశానిర్దేశం చేశారు.
వివిధ నాయకుల ప్రసంగాలు:
సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి:
ముస్లిం అని డిక్లరేషన్ ఇస్తేనేగాని, మక్కా పోవడానికి వీల్లేదు. షర్టు ధరించి పద్మనాభ స్వామి, గురవాయూర్ దేవాలయాలకు వెళ్లకూడదు. శబరిమలై అయ్యప్ప ఆలయానికి ఒక వయసులో ఉన్న మహిళలను అనుమతించరు. అనాదిగా వచ్చే సంప్రదాయాలను గౌరవించడం వల్ల వచ్చే నష్టం ఏముంది..?
ఆచారాలు, సాంప్రదాయాలు ఉన్నది గౌరవించడానికే. ఎందుకు పాటించాలని వితండవాదం తేవడం విద్వేషాలు రెచ్చగొట్టడమే. మత సామరస్యాన్ని దెబ్బతీయడమే. ఆచారాన్ని, సంప్రదాయాన్ని పాటించనప్పుడు గుడికి వెళ్లబాకండి, ఇంట్లోనే ఉండండి..మతం ఏదైనా, ప్రార్ధనా మందిరం ఎవరిదైనా వాళ్ల ఆచారాలను గౌరవించడం మనందరి ధర్మం.
అయ్యన్నపాత్రుడు(మాజీ మంత్రి):
టిడిపి కార్యకర్తలపై దాడులు, తప్పుడు కేసులు పెట్టి బిసిలను జైళ్లకు పంపడం, దళితులపై దౌర్జన్యాలు, ఇప్పుడు దేవాలయాలపై దాడులు...అన్నీ ఒక పథకం ప్రకారం చేస్తున్నారు. ఆలయాలపై ఇన్ని దాడులు జరుగుతోన్నా ముఖ్యమంత్రి మౌనం అనేక అనుమానాలకు తావిస్తోంది.
అఖిల ప్రియ(మాజీ మంత్రి):
ఆళ్లగడ్డలో కాలభైరవ స్వామి విగ్రహాన్ని ధ్వంసం చేయడం బాధాకరం. భక్తులతో కలిసి ఈరోజే దేవాలయం వద్ద నిరసన తెలిపాం. ఒక ప్రాంతం అనికాదు, అన్ని ప్రాంతాల్లో గొలుసుకట్టు దాడులు దేవాలయాలపై జరుగుతున్నాయి. ఈ దాడులపై నోరు మెదపక పోవడాన్ని బట్టి చర్చిలు, మసీదులపై దాడులు జరిగినా వైసిపి నాయకులు నోరు తెరవరని అర్ధమైంది.
ఈ దాడుల వెనుక వైసిపి హస్తం ఉందనేది వాళ్లు నోరు తెరవక పోవడాన్ని బట్టే తెలుస్తోంది. రోజ్ కంపెనీ బిస్కట్లు తిని 3గురు చిన్నారులు చనిపోయినా ప్రభుత్వం నుంచి స్పందన లేదు. బాధిత కుటుంబాలను ఆదుకునే చర్యలు లేవు.
బుద్దా నాగ జగదీశ్వర రావు(ఎమ్మెల్సీ):
కొడాలి నాని పాకిస్థాన్ మినిస్టర్ అనుకుంటున్నాడా..? ఆంధ్రప్రదేశ్ మినిష్టర్ అనుకుంటున్నాడా..? జగన్ మెప్పు కోసం దేవుళ్లపై నోరు పారేసుకుంటాడా..? నాని తిడుతుంటే జగన్మోహన్ రెడ్డి పైశాచికానందం పొందుతున్నాడు.
బుద్దా వెంకన్న(ఎమ్మెల్సీ):
వైసిపి నాయకులు ఇప్పుడు రాష్ట్రంలో 860బార్లపై పడ్డారు. లైసెన్స్ లు రెన్యువల్ చేయడంలో వసూళ్ల దందాలు చేస్తున్నారు. జగన్ వాటాగా ఒక్కో బార్ కు రూ 10లక్షలు వసూలు చేస్తున్నారు. రూ 86కోట్లు లైసెన్స్ ల రెన్యువల్ లోనే జగన్ వాటా కింద వసూళ్లు చేశారు. నాసిరకం బ్రాండ్లను అధిక రేట్లకు అమ్ముతూ మద్యం మాఫియా దందాలు యధేచ్చగా జరుగుతున్నాయి.
జివి ఆంజనేయులు(వినుకొండ):
గుంటూరు జిల్లాలో వైసిపి ఎమ్మెల్యేల మధ్య ‘‘దోపిడి పోటీ’’ నడుస్తోంది. అవినీతి కుంభకోణాల్లో ఒకరితో ఒకరు పోటీబడుతున్నారు. గుంటూరు ఎమ్మెల్యే గుట్కా తయారీలో ఉంటే, సత్తెనపల్లి ఎమ్మెల్యే మైనింగ్ దోపిడిలో ఉన్నారు, మిగిలిన ఎమ్మెల్యేలు భారీ ల్యాండ్ స్కామ్ లకు పాల్పడ్డారు.
సోమిశెట్టి వెంకటేశ్వర్లు(కర్నూలు):
కొడాలి నానికి పిచ్చి బాగా ముదిరింది. నాని కోసం కేబినెట్ లో ఒక బోను ఏర్పాటు చేయాలి. పిచ్చికుక్క మాదిరి తోటి మంత్రులను కరిచే ప్రమాదం ఉంది. ఇటువంటి పిచ్చోడిని కేబినెట్ లో పెట్టుకున్నాడంటే జగన్మోహన్ రెడ్డి మానసిక పరిస్థితి ప్రజలకు తెలుస్తోంది.
శుభకార్యాలు అన్నీ దంపతులుగా చేస్తారు, తద్దినాలు, పిండాలు పెట్టడం మాత్రమే ఒంటరిగా చేస్తారు. అలాంటిది స్వామివారి బ్రహోత్సవాలకు పట్టువస్త్రాలు ఇవ్వడం ఒంటరిగా చేయడం సాంప్రదాయ విరుద్దం.
నక్కా ఆనంద్ బాబు(మాజీ మంత్రి):
స్వాతంత్ర్యం వచ్చాక ఏ రాష్ట్రంలో జరగనన్ని దాడులు, దౌర్జన్యాలు దళితులపై ఏపిలో జరిగాయి. దేశంలో ఎక్కడా ఎప్పుడూ జరగని దాడులు దేవాలయాలపై జరుగుతున్నాయి. చివరికి న్యాయవ్యవస్థపై దాడికి కూడా వైసిపి నాయకులు తెగబడ్డారు. తన కేసుల హియరింగ్ వేగవంతం అవుతుంది, ఏడాదిలోపు జైలుకు వెళ్లాల్సి వస్తుందనే భయంతోనే కోర్టులను, జడ్జిలను జగన్మోహన్ రెడ్డి టార్గెట్ చేస్తున్నారు. దేవాలయాలపై దాడులు, దళితులపై దాడులు పక్కదారి పట్టించేందుకే వైసిపి ఎంపిలు పార్లమెంటు వద్ద డ్రామా చేస్తున్నారు.
జవహర్(మాజీ మంత్రి):
అటు దళితులన్నా, ఇటు హిందువులన్నా జగన్మోహన్ రెడ్డికి ఇష్టం లేదు. అందుకే దళితులపై, హిందువులపై దాడులను ప్రోత్సహిస్తున్నారు. భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. తిరుమలలో డిక్లరేషన్ తీసివేయాలన్న ఆలోచన జగన్ మనసులోనే పుట్టింది. అందుకే ముందు తన బాబాయి సుబ్బారెడ్డితో చెప్పించాడు, తర్వాత కొడాలి నానితో తిట్టించాడు. జగన్ కు తెలియకుండా కొడాలి నాని ఏదీ మాట్లాడడు. జగన్ చెప్పిందే వల్లె వేస్తాడు.
గొట్టిపాటి రామకృష్ణ ప్రసాద్(విజయవాడ):
టిటిడి రూ5వేల కోట్ల నిధులపై వైసిపి కన్నేసింది. తమ అక్రమాలు బైటకు రాకూడదనే ప్రజలను పక్కదారి పట్టిస్తున్నారు. దేవాలయాలపై దాడులు, దేవుళ్లపై వ్యాఖ్యలు పక్కదారి పట్టించడానికే రాజధానిలో, ఫైబర్ గ్రిడ్ లో అవినీతి ఆరోపణలు చేస్తున్నారు. డిక్లరేషన్ ఇచ్చిన తర్వాతే జగన్మోహన్ రెడ్డి తిరుమల తిరుపతి ఆలయంలో అడుగు పెట్టాలి.
రామానాయుడు(మాడుగుల):
ప్రతి పథకంలోనూ వాలంటీర్లు చేతివాటం చూపిస్తున్నారు. గ్రామాల్లో చాలా దారుణాలు చేస్తున్నారు. మా నియోజకవర్గంలో 350మంది పేర్లు తొలగించారు. విత్తనాలు, ఎరువులు సక్రమంగా సరఫరా చేసే పరిస్థితి లేదు.