ముఖ్యమంత్రి జగన్‌పై ప్రతిపక్ష నేత చంద్రబాబు తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. అసత్య వాదనతో ముఖ్యమంత్రి సభలో తన పైనే సవాల్ చేసారని చంద్రబాబు ఆక్షేపించారు. సున్నావడ్డీ పధకం కింద తన హాయంలో చెల్లించిన మొత్తాలను చంద్రబాబు వెల్లడించారు. ముఖ్యమంత్రి ఇప్పుడు క్షమాపణ చెప్పాలి లేదా రాజీనామా చేయాలని డిమాండ్ చేసారు. తాను సమాచారం తెప్పించుకొనే సమయానికి ముఖ్యమంత్రి సభ నుండి పారిపోయారని ఆరోపిం చారు. సభలో ముఖ్యమంత్రి తీరు పైన ప్రివిలేజ్ నోటీసు ఇస్తామని చంద్రబాబు వెల్లడించారు.
జగన్ సభ నుండి పారిపోయారు..
సభలో ఎలా వ్యవహరించాలో ముఖ్యమంత్రి జగన్ కు తెలియదని..తెలుసుకొనే ప్రయత్నం చేయరని ప్రతిపక్ష నేత చంద్రబాబు దుయ్యబట్టారు. ముఖ్యమంత్రి అసత్యాలతో తనకు సవాల్ విసిరారని చెప్పుకొచ్చారు. తాను సమాధానం చెప్పేందుకు సమాచారం తెప్పించుకొనే సమయంలోనే సభను వాయిదా వేసుకొని ముఖ్యమంత్రి పారిపోయారని ఫైర్ అయ్యారు. సీఎం సభలో చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. తనను వ్యక్తిగతంగా అవమానించేలా సీఎం..వైసీపీ ఎమ్మెల్యే వ్యవహరిస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. సున్నావడ్డీ పధకం కింద 2014-15లో సున్నా వడ్డీ పథకానికి రూ.230 కోట్లు కేటాయించామని, 2016-17లో రూ.175 కోట్లు, 2017-18 రూ.175 కోట్లు, 2018-19లో రూ.175 కోట్లు కేటాయించామని తెలిపారు. రైతులకు సున్నా వడ్డీ పథకం మాజీ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి హయాంలో తీసుకొచ్చారని చంద్రబాబు గుర్తుచేశారు. ఈ సమాచారం సభలో చెప్పే అవకాశం ఇవ్వకుండా స్పీకర్ హడావుడిగా సభను వాయిదా వేసుకొని వెళ్లిపోయారన్నారు.
జగన్ పంచాయితీ సభ్యుడిగా కూడా చేయలేదు..
ముఖ్యమంత్రి అయిన జగన్ కనీసం పంచాయితీ సభ్యుడిగా కూడా చేసిన అనుభవం లేదని చంద్రబాబు వ్యాఖ్యానిం చారు. జగన్‌కు సబ్జెక్ట్ తెలియదని..నేర్చుకోవాలని కూడా లేదని విమర్శించారు. కరువు మండలాలను నోటిఫై చేశాక రుణాలు రీ షెడ్యూలవుతాయని, జగన్ ఇష్టమొచ్చినట్టు మాట్లాడితే.. కోరస్‌లా మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేలు మాట్లాడా రని మండిపడ్డారు. అందుకే సభలో నా అనుభవం అంత లేదు మీ వయసు అని చెప్పానని వివరించారు. రాజకీయాల్లో వీరు మాకు పాఠాలు నేర్పిస్తారా అని ప్రశ్నించారు. 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎందరితోనో పోరాడానని.. జగన్ తో ఎలా వ్యవహరించాలో తెలియదా అని వ్యాఖ్యానించారు. తనను గాడిదలు కాసారా అని ముఖ్యమంత్రి సభలో ప్రశ్నిం చారని..ఇది పూర్తిగా అహంకారంతో చేస్తున్న వ్యవహారమని విమర్శించారు. సభలో తమను అవమానిస్తే చూస్తూ కూర్చొనే ప్రసక్తి లేదని..దీని పైన సభలోనే ప్రివిలేజ్ నోటీసు ఇస్తామని స్పష్టం చేసారు.
పొలిటికల్ టెర్రరిజం పెరిగిపోయింది..
జగన్‌కు ఎందుకు అధికారం ఇచ్చామా అని ప్రజలు బాధ పడుతున్నారని చంద్రబాబు వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో 40 రోజుల కాలంలో దాడులు పెరిగిపోయాయన్నారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలు..నేతలు ఇష్టానుసారం వ్యవహరిస్తున్నార ని ఫైర్ అయ్యారు. ఎమ్మెల్యే కోటంరెడ్డి ఒక జర్నలిస్టును బెదిరించిన ఆడియో..మరొక నేత హోం గార్డుతో అసభ్యంగా మాట్లాడిన ఆడియోలను మీడియా సమావేశంలో వినిపించారు. తనను రాజీనామా చేయాలని సవాల్ చేసిన జగన్ ఇప్పుడు తన సమాధానం విన్న తరువాత తన పదవికి రాజీనామా చేయాలని లేదా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసారు. సభలో ఈ విషయాన్ని నిలదీస్తామని..వదిలి పెట్టే ప్రసక్తే లేదని చంద్రబాబు స్పష్టం చేసారు.