తన ప్రత్యర్థులపైకి నెటిజన్లను ఉసిగొల్పి దారుణమైన విమర్శలను చేయించిన పాలకులు ఆన్‌లైన్ మీడియాలో తమపై, తమ పాలనపై వస్తున్న విమర్శలను, సెటైర్లను కూడా భరించలేక అరెస్టు చేయడం పచ్చి నియంతృత్వానికి నిదర్శనమని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకరరెడ్డి ఆరోపించారు. ప్రభుత్వ అవినీతి, అక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్తున్న సామాజిక మాధ్యమాన్ని కాళ్లకింద వేసి తొక్కేయడానికే చంద్రబాబు ప్రభుత్వం రాక్షస కుట్రలు చేస్తోందని దీంట్లో భాగంగానే హైదరాబాదీ నెటిజన్‌ని అరెస్టు చేయించి వికృతానందం పొందుతున్నారని భూమన గేలి చేశారు.
సోషల్ మీడియాలో తనపై, తన కుమారుడిపై వస్తున్న విమర్శలతో చంద్రబాబు వణికిపోతున్నారని భూమన ఎద్దేవా చేసారు. ఇటీవలి కాలంలో సోషల్ మీడియాలో వెలువడిన కథనాలపై సీఎం తనయుడు నారా లోకేశ్ అక్కసు వెళ్లగక్కారని, ఆ మీడియాను నిషేధించాలని అన్నారని, ఇప్పుడు విమర్శ చేసినందుకే వ్యక్తులను మూసివేస్తున్నారని భూమన ఆరోపించారు.
,
ప్రపంచ ప్రఖ్యాత సెర్చ్ ఇంజన్ గూగుల్‌లో పప్పు ఆంధ్రప్రదేశ్ అని కంపోజ్ చేయగానే చంద్రబాబు తనయుడు నారా లోకేశ్ బొమ్మతో సహా వస్తోందని, అలాగని గూగుల్‌నే నిషేధించగలరా.. అంత శక్తి చంద్రబాబు, లోకేశ్‌కు ఉందా అని భూమన సవాల్ చేశారు. తన పాలనను వ్యతిరేకించిన వ్యక్తులపై టీడీపీ నేతలతో అసభ్యకరంగా దూషణలు చేయిస్తున్నారు. జగన్‌పై టీడీపీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు. ప్రతిపక్ష నేతను దుర్మార్గమైన పదజాలంతో దూషిస్తుంటే, దాన్ని ఆపాల్సిన సంస్కారం చంద్రబాబుకు లేదా అని భూమన ప్రశ్నించారు.
గతంలో ఇదే సామాజిక మాధ్యమాల ద్వారా వైఎస్ జగన్‌పై టీడీపీ అధినేత హేయంగా దాడి చేయించి, ప్రయోజనం పొందిన విషయాన్ని మరిచారా, ప్రభుత్వ అరాచకాలను బయట పెడుతున్న వారిని అణగదొక్కాలనే కుట్రలు చేస్తున్నారు. తన పాలనే శాశ్వతం, తనను పొగిడితేనే ప్రజాస్వామ్యం అని చంద్రబాబు అనుకుంటే దిగజారుడుతనమే. ప్రజాగ్రహం బాబును తరిమికొట్టడం ఖాయం’’ అని భూమన తేల్చిచెప్పారు.