అమరావతి: అమెరికా అధ్యక్షుడిగా డోనాల్డ్ ట్రంప్ గెలిస్తే... ఇక్కడ టీడీపీకి షాక్ ఏంటని అనుకుంటున్నారా? అధినేత మెప్పు కోసం ఓవర్ యాక్షన్ చేస్తే... రియాక్షన్ ఇలాగే ఉంటుంది మరి. ఆయన మెప్పు కోసమని భజన మీడియా బృందం ఒక్కోసారి హద్దులు మీరి ప్రవర్తిస్తోంది. అది కాస్తా, చంద్రబాబు మెడకు చుట్టుకుంటోంది.
ఆ లెక్కన, డొనాల్డ్ ట్రంప్ తెలుగుదేశం పార్టీకి పెద్ద షాకే ఇచ్చారు. అమెరికా ఎన్నికల్లో అధ్యక్ష పదవి కోసం హిల్లరీ క్లింటన్, ట్రంప్ నువ్వా నేనా అన్నట్లు పోటీపడుతున్న సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డొనాల్డ్ ట్రంప్ పైన వ్యాఖ్యలు చేశారు. ట్రంప్‌కు వ్యక్తిగత విలువలు లేవని, కుటుంబ విలువలు లేవని వ్యాఖ్యానించారు. ఆయనకు ప్రస్తుతం ఉన్న భార్య గురించి కూడా వ్యాఖ్యానించారు. ఆమె నాలుగో భార్యనీ వెల్లడిస్తూ ఇంకా కొన్ని మాటలు అన్నారు.
పెద్దాయనే ఈ మాటలన్నాక... ఇక అమెరికాలో ఉన్న టిడిపి మద్దతుదారులందరికీ హిల్లరీకి ఓట్లు వేయమని, మిగిలిన వారితో కూడా ఓట్లు వేయించాల్సిందిగా టిడిపి ప్రముఖులు చెబుతున్నట్లు విస్తృతంగా ప్రచారం చేశారు. ఎన్నికల్లో హిల్లరీ గెలుపు తథ్యమని, చంద్రబాబు ఆకాంక్ష కూడా ఇదే అని చెప్పారు. పైగా హిల్లరీ ప్రమాణ స్వీకారానికి చంద్రబాబునాయడు కుటుంబానికి ఆహ్వానాలు కూడా అందినట్లు కూడా చెప్పుకొచ్చారు.
కానీ, మంగళవారం ఓట్ల కౌటింగ్ మొదలైన కొంతసేపటికి ట్రంప్‌కు వస్తున్నఆధిక్యం చూసి టీడీపీ తమ్ముళ్లు కొందరు డీలా పడిపోయారు. ఇదేదో ఏపీలో జరుగుతున్న ఎన్నికలన్నంత టెన్షన్, ప్రిస్టేజీ ఫీలయ్యారు. ఏదో తమ నేతే ఓడిపోయినట్లు డీలాపడ్డారు తమ్ముళ్లు. తీరా బుధవారం మధ్యాహ్నానానికి ట్రంప్ విజయం ప్రకటితం కావడంతో టిడిపికి పెద్ద షాకే తగిలినట్లైంది. ట్రంప్ విజయం ఖాయమవ్వగానే చంద్రబాబు, హిల్లరీల పైన సోషల్ మీడియాలో విపరీతమైన జోకులు కనబడటం... నిజంగా చంద్రబాబు గమనించుకుంటే... భజన చేసినవారికి బ్యాండ్ వాయించేస్తారేమో. ఎందుకంటే ఎన్నికల్లో ఎవరు గెలుస్తారో ఎవరు ఓడుతారో చెప్పలేము కదా.