ఏపీ వ్యాప్తంగా టీడీపీ సావధాన దీక్షలు : కదం తొక్కిన పార్టీ శ్రేణులు

మంగళవారం, 29 జూన్ 2021 (15:12 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు మంగళవారం రాష్ట్రవ్యాప్త నిరసనకు పిలుపునిచ్చారు. దీంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ సాధన దీక్ష పేరుతో నిరసన దీక్షలను నిర్వహిస్తోంది. కరోనా బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలనే ప్రధాన డిమాండ్‌తో ఈరోజు చంద్రబాబు నాయుడు సాధన దీక్షలో కూర్చున్నారు. 
 
అమరావతి టిడిపి పార్టీ కార్యాలయంలో సాధన దీక్షను చేపట్టిన చంద్రబాబు ప్రభుత్వం ముందు ప్రధాన డిమాండ్లను ఉంచారు. రాష్ట్రంలోని 175 నియోజక వర్గ కేంద్రాల్లో కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇంచార్జ్ లు దీక్షలను ప్రారంభించారు.
 
అమరావతి‌లోని పార్టీ ప్రధాన కార్యాలయంలో ఈ సాధన దీక్షను ప్రారంభించడానికి ముందు చంద్రబాబు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. మధ్యాహ్నం ఒంటిగంట వరకు చంద్రబాబు నిరసన దీక్షతో పాటుగా, రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ నాయకుల నిరసన దీక్షలు కొనసాగాయి. చంద్రబాబుతో పాటు తెలుగుదేశం పార్టీకి చెందిన 15 మంది నాయకులు పార్టీ ప్రధాన కార్యాలయంలో దీక్షలో పాల్గొన్నారు. 
 
ఇక తెలుగుదేశం పార్టీ వైసీపీ ప్రభుత్వానికి ప్రధానంగా డిమాండ్ చేస్తున్న అంశాలను చూస్తే కరోనా పరిస్థితుల కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా సుమారు కోటి మంది ఉపాధిని కోల్పోయారని ఆయన గుర్తుచేశారు. కరోనా తీవ్రత కొనసాగినంత కాలం ఈ కుటుంబాలకు ప్రతి నెల 7500 రూపాయలు ఇవ్వాలని టిడిపి డిమాండ్ చేసింది.
 
అలాగే, కోవిడ్‌తో మరణించిన ప్రతి కుటుంబానికి తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం 10 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందించాలని, ఆక్సిజన్ మరణాలలన్నింటికీ ప్రభుత్వానిదే బాధ్యత కాబట్టి అలా మృతిచెందిన వారి కుటుంబాలకు 25 లక్షల పరిహారం చెల్లించాలని టిడిపి డిమాండ్ చేస్తోంది.
 
ఇదే సమయంలో అకాల వర్షాలతో కుదేలైన వ్యవసాయ రంగాన్ని ఆదుకోవాలని, కరోనా కారణంగా మరింత దెబ్బతిన్న రైతన్నలను ఆదుకోవడం కోసం వ్యవసాయ ఉత్పత్తులను ప్రభుత్వమే కొనుగోలు చేసి పెండింగ్ బకాయిలను వెంటనే చెల్లించాలని టిడిపి డిమాండ్ చేస్తుంది. 

వెబ్దునియా పై చదవండి