రాష్ట్ర విభజన తర్వాత నాలుగవసారి ఏపీలో జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పాల్గొన్నారు. తారకరామ స్టేడియంలో జరిగిన వేడుకల్లో త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు బాబు. జెండాకు గౌరవ వందనం చేశారు. ఈ సందర్భంగా జరిగిన శకటాల ప్రదర్శన, సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో ఆకట్టుకున్నారు. 6 వేల మందికి మాత్రమే పరిమితంగా స్టేడియంలో కూర్చుని స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను తిలకించే అవకాశాన్ని కల్పించారు.
స్వాతంత్ర్యం కోసం పోరాటం చేసిన యోధులను ఈ సంధర్భంగా బాబు గుర్తు చేసుకున్నారు. జాతిపిత మహాత్మాగాంధీతో పాటు ఎంతోమంది ప్రముఖులు దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన తీరును ముఖ్యమంత్రి ప్రజలకు వివరించే ప్రయత్నం చేశారు. నేటి యువత గాంధీని స్ఫూర్తిగా తీసుకొని ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. దేశం అన్ని విధాలుగా అభివృద్ధి చెందాలంటే యువత పాత్ర ఎంతో కీలకమన్నారు. ప్రభుత్వ పథకాలు ప్రజలకు పూర్తిస్థాయిలో అందుతున్నాయని ఈ సందర్భంగా చంద్రబాబు చెప్పారు. ఉత్తమ సేవలు అందించిన పోలీసులను చంద్రబాబు ఘనంగా సత్కరించారు.
అమరావతిని ప్రపంచానికి తలమానికంగా, మనమంతా తల ఎత్తుకుని చూసేలా ప్రపంచస్థాయి నగరంగా నిర్మిస్తున్నాం.. ఎక్కడా రాజీపడడం లేదు. ఈ విజయదశమికి అమరావతి పరిపాలనా నగరం నిర్మాణం పనులు ప్రారంభించి 2019 మార్చి 31నాటికి సిద్ధం చేసేలా ప్రణాళికలు రూపొందించాం.. ప్రకృతి వ్యవసాయానికి ప్రోత్సాహం, రుణ ఉపశమనం-రైతుకు ఊతం, తరగు జలవనరులే లక్యం, పేదవాడి కల సాకారయ్యేలా ఇళ్ళ నిర్మాణం, ఈ-ప్రగతి సేవల్లో పురోగతి, పావుగంటలో పట్టాదారు పుస్తకం, నైపుణ్యాభివృద్థిలో మేటిగా శికణను ఇస్తున్నాం.
భారీ ఆర్థిక లోటుతో, రాజధాని కూడా లేని రాష్ట్రాన్ని ప్రగతి పథాన నడిపించేందుకు నిరంతరం కృషి చేస్తూనే ఉన్నాం.. ఎక్కడా నిరాశను దరి చేరనివ్వలేదు. మూడేళ్ళలో ఎన్నో విజయాలు సాధించాం.. ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడుతున్నాం.. అందరి ఆశలు - ఆకాంక్షలు నెరవేర్చేందుకు శాయశక్తులా కృషి చేస్తున్నామని చంద్రబాబు చెప్పుకొచ్చారు.