రాష్ట్రంలో శాశ్వత పేదరిక నిర్మూలన జరగాలి : ఏపీ సీఎం చంద్రబాబునాయుడు

బుధవారం, 25 మే 2016 (16:17 IST)
రాష్ట్రంలో పేదరికాన్ని శాశ్వతంగా నిర్మూలించాలి. ఇందుకు ప్రభుత్వ పథకాలన్నీ పారదర్శకంగా వందశాతం లబ్దిదారులకు అందినప్పుడే పేదరికాన్ని తొలగించగలుగుతాం. ప్రభుత్వ అధికారులు చిత్తశుద్ధితో కృషి చేసినపుడే ఇదంతా సాధ్యమవుతుందని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. బుధవారం విజయవాడలో జరిగిన జిల్లా కలెక్లర్లతో సీఎం చిత్తూరు జిల్లా కలెక్టర్‌, జేసీ, ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. 
 
ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ పేదవాళ్ళు శాశ్వతంగా పేదరికంలో ఉండరాదన్నారు. ఆర్థిక అసమానతలను తొలగించినపుడే ఇది సాధ్యమవుతుందన్నారు. రాష్ట్రంలో అమలవుతున్న ప్రభుత్వ పథకాలకు నిధుల సమస్య లేదన్నారు. సమస్య అంటూ ఏదైనా ఉందంటే అది ఆచరణాత్మకంలోనే ఉందన్నారు. 
 
మానవవనరులు ఉన్నాయన్న సీఎం, ఆర్థిక వనరులు సమకూర్చుకుంటున్నట్లు చెప్పారు. ఆధునిక సాంకేతికతను వినియోగిస్తున్నామని, కేవలం మన పనితీరును మెరుగు పర్చుకోవడం వల్ల రాష్ట్రాన్ని అభివృద్థి పథంలోకి తీసుకెళ్ళగలుగుతున్నామన్నారు. పరిశ్రమలు, వ్యవసాయం, ఉద్యానం, గృహ నిర్మాణాలలో రెండెంకల వృద్ధి సాధించగలిగినపుడు అనుకున్న అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. 
 
ఏపీలో దాదాపు 4.70 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టడానికి పారిశ్రామిక వేత్తలు ముందుకు వస్తున్నట్లు సిఎం చెప్పారు. రూ.1.30 లక్షల మందికి ఉపాధి కల్పించామని సీఎం చెప్పారు. 2016-17 సంవత్సరంలో ఎఫ్‌డిఐ విధానంలో మొదటి త్రై మాసంలోనే చైనాను భారత్‌ అధిగమించిందని చెప్పారు. 

వెబ్దునియా పై చదవండి