శ్రీకాకుళం జిల్లాలో మత్స్యకారులు ఉపాధిలేక, చేపల వేట సాగించలేక, పోర్టులున్న ఇతర రాష్ట్రాల తీర ప్రాంతాలకు వలసలు వెళ్లిపోతున్నారని ఆ దుస్థితిని సమూలంగా మార్చడానికి తమ ప్రభుత్వం పోర్టుల నిర్మాణానికి సంకల్పించిందని చెప్పారు.
పోర్టుతో పాటు జిల్లాలో మూడు ఫిషింగ్ జెట్టీల నిర్మాణం కూడా త్వరలోనే జరగనుందని అన్నారు. ఇద్దు వానిపాలెం, బుడగట్లపాలెం, మంచినీళ్లపేటలలో వాటి నిర్మాణానికి ప్రభుత్వం ఇప్పటికే ఆమోదం తెలిపిందన్నారు.
భావనపాడు పోర్ట్ కు అవసరమైన భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయడానికి రెవెన్యూ అధికారులతో త్వరలోనే సమీక్షిస్తామని చెప్పారు. అన్ని వర్గాల ప్రజలకు ఆమోద యోగ్యంగా, రెవెన్యూ మంత్రిగా భూసేకరణ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయించే గురుతర బాధ్యత తనపై ఉందని వివరించారు.
ఉద్దానం ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తానని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఆనాడు పాదయాత్రలో హామీ ఇచ్చినట్టుగానే ఇప్పటికే రూ.600 కోట్లతో తాగునీటి పథకం, తాజాగా పోర్టు నిర్మాణానికి మొదటి అడుగు వేయడం, జెట్టిల నిర్మాణానికి అనుమతి ఇవ్వడం లాంటి పనులతో ఇక్కడ ప్రజల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని కృష్ణదాస్ పేర్కొన్నారు.