నాటు సారా తాగినా, ఉమ్మెత్తకాయల ద్రావణం తాగినా కరోనా వైరస్ రాదంటూ చిత్తూరు జిల్లాలో జోరుగా ప్రచారం సాగింది. దీన్ని నమ్మి ఉమ్మెత్తకాయల ద్రావణం తాగిన ఏడుగురు ప్రాణాల మీదకు తెచ్చుకున్నారు. వివరాల్లోకి వెళితే.. చిత్తూరు జిల్లా, బైరెడ్డిపల్లి మండలం, ఏ.కొత్తూరు గ్రామంలో మంగళవారం ఒకే కుటుంబంలో ఏడుగురు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.
కరోనా వైరస్ నివారణ కోసం ఉమ్మెత్తకాయల ద్రావణం తాగడంతోనే వారు అస్వస్థతకు గురైనట్లు తెలిసింది. వెంటనే సమాచారం అందుకున్న అధికారులు వారిని చికిత్స కోసం స్థానిక ఆస్పత్రికి తరలించారు. కరోనా వైరస్ నివారణ కోసం రకరకాల ప్రచారాలు సాగుతున్నాయి. సారా తాగినా కరోనా నివారించవచ్చునని మెసేజ్‌లు వస్తున్నాయి. ఇలాంటి వాటిని నమ్మకూడదని అధికారులు సూచిస్తున్నారు.