ఏపీ సీఎం జగన్ సంచలన నిర్ణయం.. వైద్యం కోసం పక్క రాష్ట్రాలకు ఎందుకు?
శుక్రవారం, 28 మే 2021 (19:24 IST)
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. కరోనా నేపథ్యంలో మళ్లీ.. విపత్కర పరిస్థితులు తలెత్తకుండా ముందు జాగ్రత్తలపై ఫోకస్ చేశారు. ముఖ్యంగా వైద్యం కోసం చాలామంది హైదరాబాద్‌కు పరుగులు పెట్టాల్సిన పరిస్థితి నెలకొంది. అక్కడ ఏపీకి చెందిన ఆంబులెన్స్‌లను ఈ-పాస్‌ల సాకుతో ఆపేసిన సంగతి తెలిసిందే.
దీనిపై ఏపీ సర్కారుపై కూడా విమర్శలు ఎదురయ్యాయి. రాష్ట్రంలో కోవిడ్ కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఆస్పత్రుల్లో సమస్యల పరిష్కారం, మందులు, ఆక్సిజన్ సరఫరా.. కర్ఫ్యూ పొడిగింపు తదితర అంశాలపై సీఎం వైఎస్ జగన్ అధికారులతో చర్చించారు.
ఈ సందర్భంగా సరిహద్దులో పరిస్థితిపై ఆవేదన వ్యక్తం చేశారు. భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులు తెలెత్తకుండా చేయాలని అధికారులు ఆదేశించారు. అందుకు సంబంధించి పలు సూచనలు తీసుకున్న ఆయన.. కొత్త పాలసీని తెరపైకి తెచ్చారు.
ఆంధ్రప్రదేశ్ ప్రజలు వైద్యం కోసం బెంగళూరు, చెన్నై, హైదరాబాద్‌కు ఎందుకు వెళ్ళాల్సి వస్తుందో ఆలోచించాలి అన్నారు. రాష్ట్రంలో విజయవాడ, తిరుపతి, రాజమండ్రి సహా 16 చోట్ల హెల్త్ హబ్‌లు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఒక్కోచోట కనీసం 30 నుంచి 50 ఎకరాలు సేకరించాలి అన్నారు. అలాంటప్పుడు ఎవరూ మన రాష్ట్రం నుంచి ఇతర రాష్ట్రాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఉండదని అభిప్రాయపడ్డారు.
ఏపీలో ఏర్పాటు చేయబోయే హెల్త్ హబ్ లు కోసం ఒక్కో ఆస్పత్రికి ఐదు ఎకరాలు కేటాయించాలి అన్నారు. రాబోయే మూడేళ్లలో 100 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టే ఆస్పత్రులకు ఈ భూములు ఇవ్వాలి అన్నారు. దీనివల్ల కనీసం 80కి పైగా మల్టీ, సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు వస్తాయన్నారు. కొత్తగా 16 మెడికల్ కాలేజీలు, నర్సింగ్ కాలేజీలు వస్తున్నాయి. ప్రభుత్వం ఇచ్చే ప్రోత్సాహంతో ప్రైవేట్ రంగంలో కూడా మంచి ఆస్పత్రులు వస్తాయన్నారు సీఎం జగన్ తెలిపారు.
ఈ పాలసీతో ప్రతి జిల్లా కేంద్రం, కార్పొరేషన్‌లలో మల్టీ స్పెషాలిటీ, సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు వస్తాయని సీఎం జగన్ అభిప్రాయపడ్డారు. టెరిషరీ కేర్ మెరుగు పడితే ఇతర ప్రాంతాల్లో వైద్యానికి వెళ్లాల్సిన అవసరం ఉండదన్నారు. అలాగే ఆరోగ్యశ్రీ పథకం కింద రోగులకు మంచి వైద్యం అందుతోందని.. ప్రభుత్వ ఆధ్వర్యంలో వ్యాక్సిన్ తయారయ్యేలా ఒక విధానం తీసుకురావాలి అని సీఎం జగన్ సూచించారు.