తెలంగాణ రాష్ట్రం అన్నీ రంగాల్లో అభివృద్ధి పథంలో దూసుకెళ్తుందని.. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. గోల్కొండ కోటపై జాతీయ జెండాను ఎగురవేసిన అనంతరం రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి సీఎం ప్రసంగించారు. తెలంగాణ ఆవిర్భవించిన అతి తక్కువ కాలంలోనే అనూహ్యంగా ప్రగతి పథకంలో దూసుకెళ్లిందని కేసీఆర్ వ్యాఖ్యానించారు. తద్వారా నేడు యావత్ దేశానికి ఒక ఆదర్శవంతమైన అభివృద్ధి నమూనాను అందించిందని తెలిపారు.
ఏపీ విభజన తర్వాత తెలంగాణ ప్రభుత్వం ఎంతో పరిణతితో వ్యవహరించిందని, రాష్ట్రాన్ని ప్రగతిపథంలో నడిపించడంలో సంపూర్ణంగా నిమగ్నమైందని ఇటీవల పార్లమెంట్‌లో స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీనే ప్రస్తావించారని కేసీఆర్ గుర్తు చేశారు.
ఈ నాలుగు సంవత్సరాల విలువైన సమయాన్ని తెలంగాణ భవిష్యత్‌కు తగిన అభివృద్ధి ప్రాతిపదికలు నిర్మించేందుకు సమర్థవంతంగా వినియోగించుకున్నామని, తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రస్థానం జరుగుతుందని కేసీఆర్ చెప్పారు. తెలంగాణలో వ్యవసాయ రంగాన్ని పటిష్టపరిచే దిశగా ప్రభుత్వం నిర్మాణాత్మకమైన చర్యలు తీసుకుంటున్నదని సీఎం స్పష్టం చేశారు. సమైక్య రాష్ట్రంలో రైతుల పరిస్థితి ఆగమ్యగోచరంగా ఉండేదన్నారు.