ఆంధ్రాలో అక్కా చెల్లెమ్మల కోసం 'జగనన్న జీవక్రాంతి'

గురువారం, 10 డిశెంబరు 2020 (12:16 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అక్కా చెల్లెమ్మల కోసం ప్రభుత్వం మరో పథకానికి శ్రీకారం చుట్టింది. జగనన్న జీవక్రాంతి పేరుతో ఈ పథకం ప్రారంభించింది. రాష్ట్రంలోని మహిళలు తక్కువ శ్రమ, తక్కువ పెట్టుబడితో ఆర్థికంగా నిలదొక్కుకొని జీవన స్థాయిని, ప్రమాణాలను పెంచుకోవాలనే సంకల్పంతో ఏపీ సీఎం జగన్ గురువారం ఈ పథకాన్ని ప్రారంభించారు. 
 
తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా జగనన్న జీవక్రాంతి పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మాట్లాడుతూ, పాదయాత్ర సందర్భంగా ఇచ్చిన మరో హామీని ఈరోజు నెరవేర్చాం. అక్కాచెల్లెమ్మలకు మెరుగైన జీవనోపాధి, తద్వారా సుస్థిర ఆదాయం లక్ష్యమే 'జగనన్న జీవక్రాంతి' పథకం ముఖ్య ఉద్దేశమన్నారు. 
 
వ్యవసాయ అనుబంధ రంగాలను ప్రోత్సహించడం ద్వారా.. రైతుల్లో మరింత ఆర్ధిక అభివృద్ధి వస్తుంది. గత ప్రభుత్వాలు ఈ అంశాన్ని నిర్లక్ష్యం చేశాయి. జగనన్న జీవక్రాంతి పథకాన్ని అమూల్‌తో ఒప్పందం చేసుకోవడం ద్వారా పాడి రైతులకు, మహిళలకు ఆర్ధికంగా చేయూతనిస్తుందని చెప్పుకొచ్చారు. 
 
ఈ పథకం కింద 2.49 లక్షల గొర్రెలు, మేకల యూనిట్లు పంపిణీ చేయనున్నామని.. రూ.1,869 కోట్ల వ్యయంతో 'జగనన్న జీవక్రాంతి' పథకం ప్రారంభించాం. మహిళలకు ఆర్ధిక వనరులు పెరగాలని.. చేయూత, ఆసరా పథకాల ద్వారా రూ.5,400 కోట్లు అందిస్తున్నామని తెలిపారు. 
 
ఈ పథకం కింద 45 ఏళ్ల నుంచి 60 ఏళ్లలోపు వయస్సు గల బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు చెందిన మహిళలకు ప్రభుత్వ ఆర్థిక సాయంతో రైతు భరోసా కేంద్రాల ద్వారా గొర్రెలు, మేకల యూనిట్లు పంపిణీ చేస్తారు. 2.49 లక్షల గొర్రెలు, మేకల యూనిట్లను పంపిణీ చేసేందుకు రూ.1868.63 కోట్లు వ్యయం చేయనున్నట్టు తెలిపారు. 
 
కాగా ఈ పథకాన్ని మూడు విడతలుగా అమలు చేయనున్నారు. మొదటి విడతలో 2021 మార్చి వరకు 20 వేల యూనిట్లు, రెండవ విడతలో 2021 ఏప్రిల్‌ నుంచి ఆగస్టు వరకు 1,30,000 యూనిట్లు, మూడవ విడతలో 2021 సెప్టెంబర్‌ నుంచి డిసెంబర్‌ వరకు 99,000 యూనిట్లు.. మొత్తం మూడు విడతలుగా ఈ పథకాన్ని అమలు చేస్తారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు