హామీలు నెరవేర్చలేకే ఆపరేషన్ ఆకర్ష్ : కేసీఆర్‌పై దిగ్విజయ్ విసుర్లు

గురువారం, 16 జూన్ 2016 (16:35 IST)
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌పై కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ విమర్శలు గుప్పించారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చలేకే ఆపరేషన్ ఆకర్ష్ చేపట్టారని ఆయన ఆరోపించారు.
 
మహారాష్ట్రలోని యావత్మాల్‌లో కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో నిర్వహించే 'చాయ్ కీ చర్చ' కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆయన రాత్రి ఆదిలాబాద్‌లో బస చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రంలోని భాజపా, తెలుగు రాష్ట్రాల్లోని తెరాస, తెదేపా ప్రభుత్వాల పనితీరు మరింత అధ్వాన్నంగా ఉందన్నారు. చంద్రబాబు, కేసీఆర్‌ మధ్య అంతర్గత స్నేహబంధం ఉందని... అందుకే తెలంగాణలో తెదేపా కనీసం ప్రతిపక్ష పాత్ర పోషించలేకపోతోందన్నారు. 
 
అలాగే, బంగారు తెలంగాణ కోసమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి పది జిల్లాలను వేరు చేశామనీ, కానీ ఇపుడు కేసీఆర్‌ కుటుంబం కంబంధ హస్తాల్లో రాష్ట్రం బందీ అయిందని విమర్శించారు. చంద్రబాబు, మోడీ ప్రభుత్వాలు పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారు కొమ్ము కాస్తున్నాయని ఆరోపించారు. వంద రోజుల వ్యవధిలో నల్లధనం వెనక్కి రప్పిస్తానని హామీ ఇచ్చిన మోదీ... రెండేళ్లయినా ఆ హామీని నెరవేర్చలేకపోయారని దిగ్విజయ్ విమర్శలు గుప్పించారు. 

వెబ్దునియా పై చదవండి