రాష్ట్రానికే తలమానికంగా జాషువా కళాప్రాంగణం నిర్మాణం
బుధవారం, 23 సెప్టెంబరు 2020 (21:29 IST)
రాష్ట్ర ప్రభుత్వం గుంటూరులో నిర్మించతలపెట్టిన గుర్రం జాషువా కళాప్రాంగణం రాష్ట్రానికే తలమానికంగా నిలుస్తుందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ అన్నారు.
గుర్రం జాషువా కళాప్రాంగణం నిర్మాణంపై సచివాలయంలోని మంత్రి చాంబర్లో తెలుగు అకాడమీ చైర్ పర్సన్ నందమూరి లక్ష్మీపార్వతి, ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్, మాదిగ కార్పొరేషన్ చైర్మన్ కొమ్మూరి కనకారావు లతో కలిసి ఆయన అధికారులతో సమీక్షించారు.
రాష్ట్రంలో అన్ని వర్గాల అభివృద్ధి కోసం పాటుపడుతున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మహాకవి గుర్రం జాషువా కళా ప్రాంగణానికి మూడు కోట్ల రూపాయలను మంజూరు చేయడం జరిగిందన్నారు. దీనికి అవసరమైన 25 సెంట్ల స్థలాన్ని గుంటూరులోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో కేటాయించడం జరిగిందని చెప్పారు.
ఈనెల 28న గుర్రం జాషువా జయంతిని పురస్కరించుకొని ఇప్పటికే గుర్రం జాషువా కళాపీఠం ఆధ్వర్యంలో 125 వ జయంతి ఉత్సవాలు వారం రోజులపాటు నిర్వహిస్తున్నారని తెలిపారు.