కోర్టు ధిక్కార కేసులో ఇద్దరు ఉన్నతాధికారులకు శిక్ష

బుధవారం, 7 జులై 2021 (09:51 IST)
కోర్టు ధిక్కార కేసులో పంచాయతీరాజ్‌ శాఖ కమిషనరు గిరిజా శంకర్‌, ఐఎఫ్‌ఎస్‌ అధికారి, అప్పటి ఉద్యానవన శాఖ కమిషనరు చిరంజీవి చౌదరికి తొమ్మిది రోజుల జైలుశిక్ష, రూ.వెయ్యి జరిమానా విధిస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.

వారిద్దరూ బేషరతుగా క్షమాపణలు చెప్పడంతో జైలుశిక్ష తీర్పును సవరించి జరిమానా విధించింది. దీనిని మూడు రోజుల్లో చెల్లించకపోతే జైలుశిక్ష అమలవుతుందని స్పష్టం చేసింది. హైకోర్టు పనివేళలు ముగిసే వరకూ కోర్టులోనే నిలబడి ఉండాలని ఆదేశిస్తూ... న్యాయమూర్తి జస్టిస్‌ బి.దేవానంద్‌ ఉత్తర్వులు జారీ చేశారు.

విలేజ్‌ హార్టీకల్చర్‌ అసిస్టెంట్‌ పోస్టుల భర్తీకి ఉద్యానవన శాఖ 2020 జనవరి 10న నోటిఫికేషన్‌ను ఆ తర్వాత సవరించింది. దీనిని కృష్ణతోపాటు 35 మంది సవాల్‌చేస్తే సవరణ నోటిఫికేషన్‌ను హైకోర్టు రద్దు చేసింది. పోస్టుల భర్తీలో పిటిషనర్లకు అవకాశం ఇవ్వాలని ఆదేశాలు అమలు కాకపోవడంతో వారంతా కోర్టు ధిక్కార పిటిషన్‌ వేశారు.

ఈ కేసులో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌ దాస్‌ మంగళవారం హైకోర్టులో హాజరయ్యారు. అఫిడవిట్‌ దాఖలుకు సమయం కోరడంతో విచారణ వాయిదా పడింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు