చైనా నుంచి వ్యాప్తి చెందిన కరోనా వైరస్ ప్రపంచ దేశాలను వణికిస్తున్న విషయం తెలిసిందే. మన దేశంలో కేవలం నాలుగు రాష్ట్రాల్లోనే కొవిడ్-19 ప్రభావం ఉన్నట్లు తెలుస్తున్నది.
మన దేశవ్యాప్తంగా ఆదివారం నాటికి 1,31,868 కేసులు నమోదు కాగా, 3,867 మంది మృత్యువాత పడినట్లు ప్రభుత్వ గణాంకాలు చెప్తున్నాయి. ఇప్పటివరకు 54 వేలకు పైగా వ్యాధిగ్రస్థులు చికిత్స పొంది దవాఖానల నుంచి డిశ్చార్జి అయ్యారు.
అయితే, ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, మన దేశంలో నమోదైన మొత్తం కేసుల్లో ఎక్కువ భాగం మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు, ఢిల్లీ.. ఈ నాలుగు రాష్ట్రాల్లోనే నమోదయ్యాయి. మొత్తం కేసుల్లో 67 శాతం ఈ నాలుగు రాష్ట్రాల నుంచే ఉన్నట్లు గణాంకాలు చెప్తున్నాయి.
మహారాష్ట్రలో ఆదివారం వరకు 47,190 కేసులు నమోదు కాగా, 1,577 మంది చనిపోయారు. 13 వేల మంది డిశ్చార్జి అయ్యారు. ఇక తమిళనాడు విషయానికొస్తే.. ఇక్కడ మొత్తం కేసులు 15,512 నమోదు కాగా, 7,419 మంది కోలుకొన్నారు. 103 మంది చనిపోయారు.
గుజరాత్ రాష్ట్రంలో 13,667 కేసులు నమోదవగా.. 829 మంది చనిపోగా, 6,619 మంది చికిత్స పొంది డిశ్చార్జి అయ్యారు. ఢిల్లీలో 12,910 కేసులు నమోదయ్యాయి. ఇందులో నుంచి 231 మంది చనిపోగా, 6,267 మంది రికవరీ అయ్యారు.
ఇక రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో ఇప్పుడిప్పుడే కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండగా.. ఆదివారం వరకు ఈ మూడు రాష్ట్రాల్లో కేసుల సంఖ్య 10 వేలకు చేరువయ్యే దిశగా సాగుతున్నాయి. రాజస్థాన్‌లో 6,742, మధ్యప్రదేశ్‌లో 6,371, ఉత్తరప్రదేశ్‌లో 6,017 కేసులు నమోదయ్యాయి. పశ్చిమ బెంగాల్‌లో కూడా కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి.
అక్కడ ఇటీవల 3 వేలుగా ఉన్న ఆ సంఖ్య ప్రస్తుతం 3,500 కు చేరింది. ఇకపోతే, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశా, పంజాబ్, జమ్ముకశ్మీర్, కర్ణాటక, హర్యాణా, బీహార్ రాష్ట్రాల్లో వేయి నుంచి మూడు వేల మధ్య కేసులు నమోదయ్యాయి. కేరళ, జార్ఖండ్, అసోం, ఛత్తీస్‌గఢ్, ఉత్తరాఖండ్, హిమాచల్‌ప్రదేశ్, త్రిపుర రాష్ట్ల్రా వేయికి తక్కువగా కేసులు ఉన్నాయి.
గోవా, అండమాన్ నికోబార్, పుదుచ్చేరి, మేఘాలయ, మణిపూర్‌లలో 100 కు తక్కువగా పాజిటివ్ కేసులు తేలాయి. అరుణాచల్‌ప్రదేశ్, మిజోరాం, దాదర్ నగర్ హవేలీలలో ఒక్క కేసు కూడా నమోదు కాకపోవడం విశేషం.