కడప జిల్లాలో కరోనా కుమార్‌, కరోనా కుమారి

మంగళవారం, 7 ఏప్రియల్ 2020 (18:55 IST)
కరోనా కుమార్‌, కరోనా కుమారి.. ఈ పేర్లు వెరైటీగా వున్నాయి కదూ!.. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా కల్లోల కాలంలో పుట్టిన ఇద్దరు బిడ్డలకు ఓ వైద్యుడు చేసిన నామకరణం ఇదీ. తల్లి తండ్రుల అనుమతితోనే ఈ పేర్లు పెట్టగా.. ఇది సంచలనంగా మారింది.
 
ఆంధ్రప్రదేశ్‌లోని కడప జిల్లా వేంపల్లె పట్టణంలో పుట్టిన ఇద్దరికి కరోనా వైరస్‌ పేర్లను పెట్టారు. మండలంలోని అలిరెడ్డిపల్లెకు చెందిన రమాదేవి, తాళ్లపల్లెకు చెందిన శశికళ పురిటి నొప్పులతో పట్టణంలోని బాషా ఆసుపత్రిలో చేరింది. నిన్న వీరిలో ఒకరికి బాబు జన్మించగా, మరొకరికి పాప పుట్టింది.

ప్రస్తుతం కరోనా వైరస్‌ ప్రభావం ఉన్న నేపథ్యంలో.. బాబుకి కరోనా కుమార్‌, పాపకి కరోనా కుమారి అని పేర్లు పెట్టారు. బిడ్డల తల్లిదండ్రుల అంగీకారంతో ఆ పేర్లను వైద్యులు ఖాయం చేశారు. అప్పట్లో అమెరికా తొలి స్పేస్‌ స్టేషన్‌ స్కైలాబ్‌ 1979 లో హిందూ మహాసముద్రంలో కుప్పకూలింది.

ఆ సమయంలో పుట్టిన వారికి 'స్కైలాబ్‌' అనే పేర్లు పెట్టారు. ఇలాంటి సందర్భాలు చరిత్రలో చాలా ఉన్నాయి. తాజాగా ప్రపంచాన్ని కరోనా కబళిస్తున్న నేపథ్యంలో తాజాగా పుట్టిన వారికి కరోనా పేర్లు పెడుతున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు