పీఎంవో నుంచి కాల్ వస్తే కల అనుకున్నా : మోహన్ లాల్

ఠాగూర్

ఆదివారం, 21 సెప్టెంబరు 2025 (15:26 IST)
తనకు ప్రధానమంత్రి కార్యాలయం నుంచి ఫోన్ వచ్చిందని చెబితే నమ్మలేక ఓ కల అనుకున్నానని మలయాళ అగ్ర నటుడు మోహన్ లాల్ అన్నారు. ప్రతిష్ఠాత్మక దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డుకు ఎంపికయ్యారంటూ ప్రధానమంత్రి కార్యాలయం నుంచి ఫోన్‌ కాల్‌ వస్తే కలగా భావించానని చెప్పారు. 
 
కలలో ఉన్నానేమో అనుకుని ఆ విషయాన్ని మరోసారి చెప్పమన్నానని ఆ ఆనంద క్షణాలను గుర్తుచేసుకున్నారు. నటుడు, దర్శకుడు, నిర్మాతగా చిత్ర పరిశ్రమకు మోహన్‌లాల్‌ చేసిన సేవలకుగాను దాదాసాహేబ్‌ ఫాల్కే పురస్కారానికి ఎంపిక చేసినట్లు కేంద్రం శనివారం ప్రకటించిన సంగతి తెలిసిందే. 2023 సంవత్సరానికి గానూ ఈ అవార్డు దక్కింది. ఈ సందర్భంగా ఆదివారం విలేకరుల సమావేశంలో మోహన్‌లాల్‌ మాట్లాడారు. 
 
"ఇది మలయాళ సినిమాకు వచ్చిన అవార్డు. నిజాయతీగా పని చేయడంతోపాటు భగవంతుడి ఆశీస్సుల వల్లే ఈ పురస్కారం దక్కిందనుకుంటున్నా. నన్ను అభిమానించే వారందరికీ ఈ అవార్డు చెందుతుంది. సినిమా తప్ప నాకు పెద్ద డ్రీమ్స్‌ లేవు"  అని మోహన్ లాల్ పేర్కొన్నారు.
 
"ఎంతోమంది గొప్ప వ్యక్తులు ప్రయాణించిన దారిలోనే నేనూ నడిచా. నేనేం సాధించినా దానికి కారణం వారే. 48 ఏళ్ల నా ప్రయాణంలో నేను కలసి పని చేసిన కొందరు ఇప్పుడు లేరు. కానీ, ఆ జ్ఞాపకాలెప్పుడూ నాతోనే ఉంటాయి. ఫలానా పాత్రలోనే నటించాలని ఎప్పుడూ అనుకోను. కథ, కాంబినేషన్స్‌పైనే ఆసక్తి చూపిస్తా. ప్రేమ్‌ నజీర్‌, అమితాబ్‌ బచ్చన్‌, శివాజీ గణేశన్‌ లాంటి వారితో కలసి నటించడం గొప్ప అనుభూతి" అని మోహన్‌లాల్‌ అన్నారు. 'దృశ్యం-3' చిత్రీకరణ సోమవారం ప్రారంభమవుతుందన్నారు. ఈ నెల 23న ఢిల్లీలో జరిగే 71వ జాతీయ పురస్కారాల ప్రదానోత్సవంలో మోహన్‌లాల్‌ ఈ అవార్డును అందుకోనున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు