కరోనా వైరస్: తిరుమలలో క్రిమి సంహారక ద్వారం, ఎలా పనిచేస్తుందంటే..!

గురువారం, 23 ఏప్రియల్ 2020 (19:03 IST)
తిరుమల శ్రీవారి ఆలయంలోకి వెళ్ళే అర్చకులు, ఉద్యోగులకు కోవిడ్-19 నుంచి రక్షణ కోసం ఆయుర్వేద క్రిమి సంహారక ద్వారం ఏర్పాటు చేసారు. దీన్ని డిస్‌ఇన్ఫెక్షన్ టన్నెల్ అని పిలుస్తారు. ఈ ద్వారాన్ని చెన్నైకి చెందిన ష, అభయ, మలజైన్ కుటుంబ సభ్యులు టిటిడికి విరాళంగా అందజేశారు.
 
నానో లైఫ్ సంస్థ ఈ టన్నెల్‌ను రూపొందించింది. ఇది ప్రపంచపు తొలి ఆయుర్వేదిక్ క్రిమి సంహారక ద్వారం అని దాన్ని తయారుచేసిన వారు చెబుతున్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించిన ఈ ద్వారంలోకి మనిషి ప్రవేశించగానే సెన్సార్లు గుర్తించి క్రిమి సంహారక ద్రావణాన్ని పిచికారి చేస్తాయి. 
 
ఆలయంలోకి వెళ్ళేవారు, వచ్చే వారు దీనిద్వారా నడవడం వల్ల హానికరమైన క్రిములు బారిన పడకుండా ఉండొచ్చు. ఇలాంటి ద్వారాలను మరిన్ని తెప్పించేందుకు టిటిడి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. కరోనా వైరస్ వ్యాపిస్తున్న తరుణంలో ఈ ఆయుర్వేద క్రిమి సంహారక ద్వారం ఎంతగానో ఉపయోగపడుతుందంటున్నారు టిటిడి ఉన్నతాధికారులు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు