కరోనా పెళ్ళి భోజనం... ఎక్కడ?

బుధవారం, 29 జులై 2020 (22:36 IST)
కరోనావైరస్ కారణంగా పెళ్ళి తంతు కూడా తూతూమంత్రంగా అయిపోతోంది. శుభమా అని పెళ్ళివారింట పదిమందికి పప్పన్నం పెట్టే పరిస్థితి కూడా లేదు. ఇలాంటి పరిస్థితుల్లో కొంచెం డిఫరెంట్‌గా ఆలోచించాడు ఓ పెళ్ళికొడుకు. బంధువులు, చుట్టుప్రక్కల వాళ్లు తమ ఇంటికి వచ్చి భోజనం చేయడం కంటే తానే మూడుపూటలా సరిపోయే పెళ్ళిభోజనం పంపించాలనుకున్నాడు. 
 
ఇంకేముంది ఇంటింటికి టిఫిన్, లంచ్, డిన్నర్ పార్సిళ్ళను పంపించాడు. ఈ వెరైటీ పెళ్ళి భోజనం విశాఖలోని అరిలో జరిగింది. కరోనా వేళ బంధువుల ఇళ్ళకే భోజన పార్సిళ్ళు పంపించాడు వరుడు శ్రీనివాస్. శ్రీనివాస్‌కు 5 నెలల కిందట వివాహం కుదిరింది. కరోనా కారణంగా పెళ్ళి వాయిదా పడుతూ వచ్చింది.
 
పెళ్ళి ధూమ్‌ధామ్‌గా చేయాలనుకున్న ఇరు కుటుంబాలకు కరోనా ఆంక్షలు అడ్డొచ్చాయి. ఎలాగోలా నిన్న తక్కువమంది కుటుంబ సభ్యుల మధ్య పెళ్ళి చేసేసుకున్నాడు. సామూహిక పెళ్ళి భోజనాలు పెట్టడం ప్రమాదమేనని గ్రహించిన పెళ్ళి కొడుకు భోజనాలను తయారుచేయించి బంధువుల ఇళ్ళకే పంపాడు. వరుడు చేసిన పనిని మెచ్చుకున్నారు కుటుంబ సభ్యులు. 
 
బంధువులకు, చుట్టుప్రక్కల వారికి పంపిన భోజనంలో అన్ని రకాల రుచులతో కూడిన కర్రీస్, వాటర్ బాటిళ్ళు అన్నింటిని జతచేసి పంపించాడు. పెళ్ళికి వచ్చి తిరిగి వెళ్ళేటప్పుడు బంధువులకు ఏదో ఒక చిన్న వస్తువులను ఇస్తుంటారు. అదేవిధంగా ప్రతి ఇంటికి చిన్నపాటి వస్తువులను పంపాడు పెళ్ళికొడుకు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు