ఏపీ ప్రభుత్వ పాఠశాలల్లో కరోనా కలకలం: ఒక్కరోజులోనే 6వేలకు పైగా కేసులు

బుధవారం, 19 జనవరి 2022 (10:26 IST)
ఏపీ ప్రభుత్వ పాఠశాలల్లో కరోనా కలకలం రేపుతోంది. ముఖ్యంగా ప్రకాశం జిల్లాలో ఒకే రోజు స్కూళ్లలో 17 పాజిటివ్‌ కేసులు వెలుగుచూశాయి. త్రిపురాంతకం మండలం మేడపి, యద్దనపూడి మండలం పూనూరు స్కూళ్లలో బోధనేతర సిబ్బందికి కోవిడ్‌ సోకింది. 
 
తాజాగా ప్రకాశం జిల్లాలో బుధవారం ఒక్కరోజే 17 మంది సిబ్బందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. అందులో 15 మంది ఉపాధ్యాయులు, ఇద్దరు బోధనేతర సిబ్బందికి కోవిడ్‌ సోకింది. ఒంగోలు డీఆర్ఎం, ప్రభుత్వ బాలికోన్నత పాఠశాల, అద్దంకి మండలం తిమ్మాయపాలెం, చిన్నగంజాం జెడ్పీ హైస్కూల్‌లో ఇద్దరికి చొప్పున కరోనా సోకింది.
 
ఒంగోలు కేంద్రీయ విద్యాలయ, మార్కాపురం శారదా ఎయిడెడ్ స్కూల్, కనిగిరి నందన మారెళ్ల, సింగరాయకొండ మండలం కలికివాయి, టంగుటూరు మండలం కొణిజేడు, పంగులూరు మండలం రేణిగంవరం, సంతమాగులూరు మండలం పుట్టావారిపాలెం, యద్దనపూడి మండలం యనమదల, గన్నవరం ఎంపీపీఎస్ స్కూళ్లలో ఒక్కక్కరు చొప్పున ఉపాధ్యాయులకు కరోనా పాజిటివ్‌గా తేలింది. 
 
ఇకపోతే.. ఏపీలో కరోనా మహమ్మారి మరింత విస్తరిస్తోంది. ఒక్కరోజులోనే 6వేలకు పైగా కొత్త కేసులు నమోదయ్యాయి. గడచిన 24 గంటల్లో 38,055 శాంపిల్స్ పరీక్షించగా 6,996 పాజిటివ్ కేసులు వెల్లడయ్యాయి. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 1,534 మంది కరోనా బారినపడగా, విశాఖ జిల్లాలో 1,263, గుంటూరు జిల్లాలో 758, శ్రీకాకుళం జిల్లాలో 573 కేసులు గుర్తించారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు