ఏపీలో వెలుగు చూసిన ఒమిక్రాన్ ఉప వేరియంట్.. దాని లక్షణాలు ఏంటి?

ఆదివారం, 9 ఏప్రియల్ 2023 (09:59 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒమిక్రాన్ ఉప వేరియంట్ వైరస్ వెలుగు చూసింది. దీనికి అర్ట్యురుస్ అని నామరకరణం చేసిన విషయం తెల్సిందే. ఈ వైరస్ సోకినవారిలో తొలుత జ్వరం, ఆ తర్వాత దగ్గు. జలుబు వంటివి కనిపిస్తాయి. దీంతో అప్రమత్తమైన ఏపీ సర్కారు సోమవారం నుంచి వ్యాధి నిర్ధారణ పరీక్షల సంఖ్యను పెంచాలని నిర్ణయించింది.
 
ఒమిక్రాన్‌ ఉప వేరియంట్‌కు చెందిన ఎక్స్‌బీబీ.1.16 (అర్ట్యురుస్‌) రకం కొవిడ్‌ కేసులు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా నమోదవుతున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ జారీచేసిన జాబితాలో ఈ వేరియంట్‌ గురించి ప్రస్తావించింది. గురువారం ఉదయం నుంచి శుక్రవారం ఉదయం వరకు 44, శుక్రవారం ఉదయం నుంచి శనివారం ఉదయం వరకు 14 చొప్పున కొత్తగా కరోనా కేసులు నమోదయ్యాయి. 
 
రాష్ట్రంలో ప్రస్తుతం 144 క్రియాశీలక కేసులున్నాయి. పది మంది బాధితులు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. విజయవాడ జీజీహెచ్‌లో ఇన్‌పేషంట్లుగా చేరిన వారిలో జ్వరం, దగ్గు, జలుబు లక్షణాలు ప్రధానంగా కన్పిస్తున్నాయి. జ్వరం రెండు రోజుల్లో తగ్గిపోయాక దగ్గు, జలుబు వస్తుంది. చిన్న వయస్కుల్లో అయితే కళ్లల్లో ఎరుపుదనం కనిపిస్తోంది. దీనికి కారణాలపై నిర్ధరణకు వచ్చేందుకు సమయం పడుతుందని వైద్యులు చెబుతున్నారు. 
 
గతంలో మాదిరిగా గొంతునొప్పి, ఒంటి నొప్పులు పెద్దగా లేవని వెల్లడించారు. ఇతర రాష్ట్రాల్లో కరోనా కేసులు పెరుగుతున్నందున ఏపీలోనూ పరీక్షల సంఖ్య పెంచాలని ప్రభుత్వ వర్గాలు నిర్ణయించాయి. రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం రోజుకు వెయ్యి పరీక్షలు కూడా జరగడంలేదు. ఒమిక్రాన్‌ వేరియంట్‌ వ్యాప్తి తీవ్రంగా ఉంటుందని గత అనుభవాలు చెబుతున్నాయి. రాష్ట్రంలో కొవిడ్‌ ప్రభావంపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి శనివారం సమీక్షించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు