కాపునాడు మహానుభావులు ఇంతటితో మరిచిపోవాలి : నారాయణ

బుధవారం, 20 జులై 2022 (15:01 IST)
మెగాస్టార్ చిరంజీవిని ఊసరవెల్లి అంటూ తాను చేసిన వ్యాఖ్యలపై సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ పశ్చాత్తాపం వ్యక్తం చేశారు. చిరంజీవిపై తాను చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్టు చెప్పారు. 
 
ఇటీవల చిరంజీవి, వవన్ కళ్యాణ్, ప్రధానమంత్రి నరేంద్ర మోడీలపై తీవ్ర విమర్శలు చేశారు. అల్లూరి సీతారామరాజు జయంతి రోజున ప్రధాని నరేంద్ర మోడీ ముఖ్య అతిథిగా హాజరై భీమవరంలో ఏర్పాటు చేసిన అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వేదికపైకి చిరంజీవిని కూడా ఆహ్వానించారు. 
 
దీన్ని సీపీఐ నారాయణ తప్పుబట్టారు. వేదికపైకి చిరంజీవిని కాకుండా సూపర్ స్టార్ కృష్ణను ఆహ్వానించివుంటే బాగుండేదన్నారు. చిరంజీవి ఒక ఊసరవెల్లి అని వ్యాఖ్యానించారు. అలాగే, పవన్ కళ్యాణ్ ఒక ల్యాండ్‌మైన్ వంటివారన్నారు. ఎపుడు ఎలా ప్రవర్తిస్తాడో ఆయనకే తెలియదని నారాయణ ఎద్దేవా చేశారు. 
 
మరోవైపు, చిరంజీవి, పవన్‌లపై నారాయణ చేసిన వ్యాఖ్యలపై జనసేన సైనికులు ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో నారాయణను ట్రోల్ చేశారు. అలాగే, నారాయణ వ్యాఖ్యలపై మెగా బ్రదర్ నాగబాబు కూడా మండిపడ్డారు. "సీపీఐ నారాయణ అనే వ్యక్తి అన్నం తినడం మానేసి గడ్డి తింటున్నారంటూ" ఆగ్రహం వ్యక్తం చేశారు. 
 
దీంతో నారాయణ దిగివచ్చారు. చిరంజీవిపై తాను చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్టు తెలిపారు. వాటిని భాషా దోషంగా భావించాలని, తాను చేసిన వ్యాఖ్యలకు చింతిస్తున్నానని, మెగా అభిమానులు, కాపునాడు మహానుభావులు ఈ వ్యాఖ్యలను ఇంతటితో మరిచిపోవాలని నారాయణ కోరారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు