కేంద్రం మాదిరిగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా పెట్రోల్, డీజిల్ పై లీటర్ కు రూ.10/- చొప్పున తగ్గించాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ డిమాండ్ చేశారు. ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కూడా పెట్రోల్, డీజిల్ ధరలపై లీటర్కు రూ 10 చొప్పున తగ్గించాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ డిమాండ్ చేశారు.
కేంద్ర ప్రభుత్వం గత సంవత్సర కాలంగా లీటర్ పెట్రోల్ పై రూ.36, డీజిల్ పై రూ.25 చొప్పున పెంచిందని, కేంద్రంలోని నరేంద్రమోడీ ప్రభుత్వం కరోనా కష్టకాలాన్ని అవకాశంగా మలుచుకుని అధిక ధరల భారాన్ని ప్రజలపై మోపిందని విమర్శించారు. దేశవ్యాప్తంగా ప్రజల నుండి ఆగ్రహ జ్వాలలు వెల్లువెత్తగా, కేంద్రం ఇప్పుడు లీటర్ పెట్రోల్ పై రూ.5, డీజిల్ పై రూ.10 తగ్గిస్తున్నట్టు కంటితుడుపు చర్యగా ప్రకటించిందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ వివరించారు.
పెట్రో ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తీసుకురాకపోవటం కేంద్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలకు అద్దం పడుతోందని, పెట్రో ఉత్పత్తుల ధరల పెరుగుదలతో రవాణా రంగంపై తీవ్ర భారం పడుతుందని ఆయన పేర్కొన్నారు. ఫలితంగా నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతున్నాయని, కరోనా బూచికి తోడు అధిక ధరల భారాల వల్ల ప్రజల జీవన స్థితిగతులు అస్తవ్యస్తంగా మారుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. కేవలం కార్పొరేట్ అనుకూల విధానాలు అవలంబిస్తున్న కేంద్ర ప్రభుత్వ తీరును నిరసిస్తున్నామన్నారు. మోడీ ప్రభుత్వం ఏడాదిన్నర కాలంగా ఇబ్బడిముబ్బడిగా పెంచిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను పూర్తిగా తగ్గించాలని డిమాండ్ చేశారు.
కేంద్ర ప్రభుత్వానికి ఏమాత్రం తీసిపోని విధంగా ఏపీ ప్రభుత్వం, పెట్రో ఉత్పత్తులపై ఎక్సైజ్ సుంకంతో పాటు, లీటర్ కు రూ.4 చొప్పున అదనపు భారాన్ని ప్రజలపై మోపిందని విమర్శించారు. కేరళ రాష్ట్ర ప్రభుత్వం పెట్రోల్ పై రూ.10లు తగ్గించిందని, పలు రాష్ట్ర ప్రభుత్వాలు పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గించాయని పేర్కొన్నారు. ఏపీ ప్రభుత్వం కూడా పెట్రోల్, డీజిల్ లపై లీటర్ కు రూ.10 చొప్పున తగ్గించాలని రామకృష్ణ డిమాండు చేశారు.