దాండియా వేడుకలు నగరాన్ని ఉర్రూతలూగిస్తున్నాయి. నూతన రాజధాని అమరావతిలో తొలిసారిగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి విజయవాడ ప్రజలు ఉత్సాహంగా హాజరవుతున్నారు. ఇక్కడి నగర పాలక సంస్ధ క్రీడామైదానం పుట్‌బాల్ గ్రౌండ్‌లో బుధవారం ప్రారంభమైన వేడుకలు వినూత్న రీతిలో నగర వాసులను ఆకర్షిస్తుండగా, గురువారం మరింత ఆహ్లాదభరిత వాతావరణంలో సాగాయి. బెజవాడ కనకదుర్గమ్మకు నృత్య నీరాజనం అర్పిస్తూ క్రియేటివ్ సోల్ నిర్వహిస్తున్న ఈ దాండియా పండుగ శుక్రవారంతో ముగియనుండగా విజయవాడ వాసులకు వినూత్న అనుభూతిని మిగిల్చిందనటంలో ఎటువంటి సందేహం లేదు.
సాంప్రదాయ వస్త్రాలతో చిన్న పెద్ద కలిసి చేసిన దాండియా, గర్బా నృత్యరీతులు మునుపెన్నడూ ఇక్కడ ప్రదర్శితం కాలేదని సాంస్కృతిక ప్రేమికులు అభిప్రాయపడుతున్నారు. విభిన్న భాషలకు సంస్కృతులకు నిలయమైన హైదరాబాద్‌లో మాత్రమే ఇప్పటి వరకు దాండియా అన్న పదం వినిపిస్తూ ఉండేది. క్రియేటివ్ సోల్ నిర్వహిస్తున్న ఈ వేడుకతో బెజవాడ పుర ప్రజలకు దాండియా, గర్బా నృత్యాలతో అనిర్వచనీయమైన పరిచయం ఏర్పడింది. ప్రత్యేకంగా శిక్షణ పొందిన కళాకారులు చేసిన నృత్య రీతులు సంభ్రమాశ్చర్యాలకు గురి చేసాయి. ఆరు సంవత్సరాల చిన్నారుల మొదలు, అరవై సంవత్సరాల వృద్దుల వరకు ఉత్సాహంగా పదం పాడుతూ కదం తొక్కిన వేళ ఇక్కడి ఇందిరా గాంధీ నగర పాలక క్రీడా మైదానం అవరణలోని పుట్‌బాల్ స్టేడియం పులకించింది.
నిన్నమొన్నటి వరకు హైదరాబాద్ వాసులకు మాత్రమే పరిమితం అయిన దాండియా వేడుకలను విజయవాడ తీసుకువచ్చిన క్రియేటివ్ సోల్ వ్యవస్ధాపకులు సుమన్ మీనా, నేహా జైన్ ఈ సందర్భంగా మాట్లాడుతూ నగర ప్రజల నుండి లభిస్తున్న ప్రోత్సాహం మరువలేనిదన్నారు. ఈ ఆదరణ తమకు మరింత ఉత్సాహాన్ని ఇచ్చిందని వచ్చే సంవత్సరం అమ్మవారికి మరింత వేడుకగా నృత్య నీరాజనం అర్పించేందుకు ఇప్పటి నుండే ప్రణాళికలు సిద్దం చేసుకుంటున్నామన్నారు.ఇప్పటికే రెండు రోజులు గడిచిపోగా మరో రోజు మాత్రమే సాంస్కృతిక ప్రేమికులకు అవకాశం ఉందని, ముందస్తుగా ఎంట్రీపాస్‌లు తీసుకుని కార్యక్రమానికి హాజరు కావచ్చన్నారు.
ఓపెన్ గ్రౌండ్‌లో నిర్వహిస్తున్న వేడుకకు వర్షం స్వల్ప ఆటకం కలిగించినా అమ్మవారి ఆసీస్సులు తోడవటంతో చినుకు కూడా చిందేసి తమను ఉత్సాహపరిచినట్లయ్యిందన్నారు. క్రియేటివ్ సోల్ సహ వ్యవస్ధాపకురాలు నీహా జైన్ మాట్లాడుతూ కేవలం శిక్షణ పొంది దాండియా ఆడుతున్న వారికే కాకుండా తమ ప్రతిభను ప్రదర్శించిన వారికి కూడా బహుమతులు అందిస్తున్నామన్నారు. ఉత్సాహవంతులైన స్దానిక కళాకారులు ఈ వేదిక ద్వారా తమను తాము పరిచయం చేసుకోవచ్చన్నారు. ప్రతిరోజు ఉత్తమ ప్రదర్శన, ఉత్తమ వస్త్రధారణకు బహుమతులు అందచేస్తున్నామని, వయస్సుల వారిగా ఏడు విభాగాలుగా వీటిని అందుకుంటున్నారని తెలిపారు.
మూడు రోజుల ప్రదర్శన ముగింపులో మహిళ, పురుష విభాగాలలో ప్రధమ బహుమతిగా హోండా వాహనాలను అందిస్తున్నామన్నారు. ఇంకా ఎల్‌సిడి టివిలు, హోమ్ ధియేటర్లు వంటి బహుమతులు సిద్దంగా ఉన్నాయని, ఎంట్రీపాస్ పొందిన వారి నుండి కూడా డ్రా ద్వారా ఎంపిక చేసి బహుమతులు అందిస్తామని నీహా జైన్ వివరించారు. సమైఖ్య రాష్ట్రంలో రాజకీయ రాజధానిగా ప్రాచుర్యం పొందిన విజయవాడ ఇప్పుడు సాంస్కృతిక రాజధానిగా మారుతుందని ఈ క్రమంలో క్రియోటివ్ సోల్ తనదైన భూమికను పోషిస్తుందని సంస్ధ వ్యవస్ధాపకులు సుమన్ మీనా, నీహా జైన్ వివరించారు.