ఇక హెల్మెట్ ఉంటేనే పెట్రోల్... ఎక్కడ?

ఆదివారం, 24 సెప్టెంబరు 2017 (15:38 IST)
రోడ్డు ప్రమాదాల నివారణ, రోడ్డు ప్రమాదాల వల్ల జరిగే మృతుల సంఖ్యను తగ్గించేందుకు రోడ్డు, భద్రతా విభాగంతో పాటు.. ట్రాఫిక్ పోలీసులు వివిధ రకాలైన ప్రచార కార్యక్రమాలు చేపడుతూ, కఠిన నిబంధనలను అమలు చేస్తోంది. అయినప్పటికీ.. రోడ్డు ప్రమాదాల సంఖ్య ఏమాత్రం తగ్గడం లేదు. ఈ ప్రమాదాల్లో ఎక్కువగా మద్యం సేవించి వాహనాలు నడపడం వల్లే జరుగుతున్నట్టు గుర్తించారు. అదీ కూడా ద్విచక్రవాహనదారులే. వీరిలో ఎక్కువ మంది హెల్మెట్ ధరించక పోవడం వల్ల మృత్యువాతపడుతున్నట్టు సమాచారం. 
 
ఈ నేపథ్యంలో, విజయవాడ నగర పరిధిలో ద్విచక్ర వాహనదారులకు శిరస్త్రాణం తప్పనిసరి అమలుకు కఠిన చర్యలు తీసుకోనున్నామని నగర పోలీసు కమిషనర్‌ గౌతమ్‌ సవాంగ్‌ తెలిపారు. శిరస్త్రాణం ధరించిన వారికే బంకుల్లో పెట్రోల్‌ విక్రయించేలా చర్యలు చేపట్టనున్నామని వెల్లడించారు. మరో రెండ్రోజుల్లో శిరస్త్రాణం నిబంధనలను అమలు చేస్తామని పేర్కొన్నారు.
 
శిరస్త్రాణం ధరించనివారికి జరిమానాలు కూడా విధిస్తామన్నారు. భవిష్యత్‌లో వాహన తనిఖీలు మరింత పెంచుతామన్నారు. వాహనదారులు శిరస్త్రాణం ధరించకపోతే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. అధిక సామర్థ్యం గల ద్విచక్ర వాహనాలు పిల్లలకు ఇవ్వొద్దని తల్లిదండ్రులకు సూచించారు. శిరస్త్రాణం ధరించేలా చూసే బాధ్యత కూడా వారిదేనని పేర్కొన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు