దేవినేని నెహ్రూ, ఆయన కుమారుడు దేవినేని అవినాష్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో తెదేపా తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా దేవినేని మాట్లాడుతూ... తను టీడీపీ కండువా కప్పుకునే చనిపోవాలని 1993లోనే అనుకున్నానని, కానీ మధ్యలో కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లినా తిరిగి తెదేపాలో చేరుతున్నందుకు సంతోషంగా ఉందన్నారు.
చంద్రబాబు నాయుడు అమరావతి రాజధానికి రక్షణ కవచంగా ఉన్నారని చెప్పుకొచ్చారు. కనీసం కూర్చునేందుకు కుర్చీ, టేబుల్, ఫ్యానులు లేకపోయినా రెండేళ్లలోనే రాజధాని కోసం అవసరమైన నిధులు సాధించుకుంటూ వెళుతున్నారన్నారు. తనకు రాజకీయ భిక్ష పెట్టింది స్వర్గీయ ఎన్టీ రామారావు అయితే తనకు మంత్రి పదవి చంద్రబాబు నాయుడు వల్ల వచ్చిందన్నారు. ప్రతిపక్ష పార్టీ వైకాపా గురించి చెపుతూ... ఆ పార్టీకి రాష్ట్రం మీద అసలు అవగాహన లేదని కొట్టి పారేశారు. రాష్ట్రాభివృద్ధి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతోనే సాధ్యమవుతుందని చెప్పారు.