చంద్ర‌బాబుపై జ‌రిగిన దాడిని కేంద్రం దృష్టికి తీసుకెళ్తాం : దేవినేని ఉమ

శుక్రవారం, 29 నవంబరు 2019 (15:43 IST)
తెలుగుదేశం అధినేత‌, మాజీ ముఖ్య‌మంత్రి చంద్రబాబు నాయుడు రాజధాని పర్యటన సందర్భంగా వైసిపి రాజకీయం చేసింద‌ని, జ‌డ్‌ప్ల‌స్ క‌లిగిన వ్య‌క్తిపై దాడికి దిగ‌డం, ప‌ర్య‌ట‌న‌కు బయలుదేరిన 15 నిమిషాల్లోనే బయటి నుంచి వచ్చిన వ్యక్తులు రాళ్లు, చెప్పులు‌ విసిర‌డం ఏ సంస్కృతి అని తెదేపా నేత‌, మాజీ మంత్రి దేవినేని ఉమామ‌హేశ్వ‌ర‌రావు అన్నారు. 
 
శుక్ర‌వారం ఉద‌యం తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాల‌యంలో ఏర్పాటు చేసిన మీడియా స‌మావేశంలో దేవినేని ఉమా మాట్లాడుతూ చంద్రబాబు రాజధాని పర్యటన సందర్భంగా వైసిపి రాజకీయం చేసింది. బయలుదేరిన 15 నిమిషాల్లోనే బయటి నుంచి వచ్చిన వ్యక్తులు రాళ్లు, చెప్పులు‌ విసిరారు. జ‌డ్ ప్లస్ భద్రతలో ఉన్న వ్యక్తి ప్రయాణిస్తున్న బస్సుపై దాడి చేశారు. డిఎస్పీ సమక్షంలోనే ఇదంతా జరిగినా పోలీసులు చోద్యం చూశారు. నిరసన తెలిపే హక్కు అందరకీ ఉంటుంది అని డిజిపి అంటున్నారు. 
 
రైతు, రియల్ ఎస్టేట్ వ్యాపారి  చెప్పు‌, రాళ్లు విసిరరాని ప్రకటన ఇస్తారా. జడ్ ప్లస్ భద్రతా వలయంలో ఉన్న వారిపై దాడి చేయడం ఎటువంటి సంస్కృతి. రాష్ట్రంలో ఏ విష సంస్కృతిని అమలు చేస్తున్నారో‌ జగన్ చెప్పాలి. గురువారం జరిగిన ఘటనపై సిఎం ఎందుకు మాట్లాడరు.. ఆయన నోరు విప్పాలి. 33 వేల ఎకరాలను రాజధాని కోసం రైతులు ఇస్తే వారిని అవమానిస్తారా. చంద్రబాబు దూరదృష్టిలో ఆలోచించి రూ.40వేల కోట్ల పనులు ప్రారంభించారు. 
 
రూ.9 వేల కోట్లతో భవనాలు, కార్యాలయాలు పూర్తి చేశాం. ప్రభుత్వంపై ఆర్థిక భారం లేకుండా చుడాలని చంద్రబాబు ప్రణాళికబద్దంగా ముందుకెళ్లారు. ఒక్క ఇటుక కూడా వేయలేదని ఒక మంత్రి, శ్మశానం అని మరో మంత్రి సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు. మేము పేదల కోసం ఇళ్లు కడితే .. మీరు సున్నం కొట్టి వారికి ఇవ్వలేకపోయారు. ప్రధానిమోడి శంకుస్థాపన చేస్తే ఆ ప్రాంతాన్ని ఎడారిగా చేసిన పాపం జగన్‌దే. చంద్రబాబు నిర్మాణాలు చేసిన భవనాల్లో కూర్చుని ఆయన్నే తిడుతున్నారు. 
 
ఇది‌ బూతుల ప్రభుత్వమా...‌ మీ‌ మంత్రులు బూతుల భాష, సంస్కృతి‌ చూసి ప్రజలు చీదరించుకుంటున్నారు. కొడాలి నానికి బూతుల మంత్రిగా, అధ్యక్షుడిగా బిరుదు ఇవ్వొచ్చు. కనీసం ఇంగితం లేకుండా మంత్రులు మాట్లాడుతుంటే జగన్ ఎందుకు స్పందించడం లేదు. ఇదేనా మీ సంస్కృతి, ఇదేనా మీ భాష.. ఇందుకేనా తెలుగు‌ వద్దంటున్నారు. చదువుకునే లక్షలాది మందికి మీరు‌ బూతులు నేర్పుతున్నారా. ప్రధాన ప్రతిపక్ష నాయకుడిని పట్టుకుని, సిఎంగా చేసిన వ్యక్తిని ఇంత ఘోరంగా తిడతారా. 151 ఎమ్మెల్యే లు, 23 ఎంపీలు ఇచ్చినా జగన్‌లో అభద్రతా భావం నెలకొంది. 
 
మీ తప్పులను కప్పిపుచ్చుకోవడానికి ఈ బూతుల భాషా ప్రావీణ్యాన్ని ఉపయోగిస్తున్నారు. జగన్ తీరు వల్ల రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు భయపడుతున్నారు. ఇప్పటికే ప్రముఖ కంపెనీలు కూడా వెనక్కి వెళ్లి పోయాయి. మన రాజధానిని రక్షించుకునేందుకు డిసెంబరు 5వ తేదీన రౌండ్ టేబుల్ సమావేశం నిర్వ‌హిస్తాం.

రాజకీయాలకు అతీతంగా అందరూ ఈ సమావేశంలో పాల్గొనాలి. జగన్ ఫ్యాక్షన్ భావజాలంతో మంత్రులను ప్రోత్సహించి తిట్టిస్తున్నారు. చంద్రబాబుపై జరిగిన దాడిపై కేంద్రాన్ని ఆశ్రయిస్తాం. జడ్‌ప్లస్ భద్రత‌లో ఉన్న చంద్రబాబుపై‌ దాడి చేస్తే పోలీసులు చూస్తూ ఊరుకుంటారా. దీనిపై న్యాయస్థానాన్ని ఆశ్రయించి.. పోరాటం చేస్తాం అన్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు