ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటాం.. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తాం.. డిగ్గీరాజా

మంగళవారం, 18 అక్టోబరు 2022 (14:45 IST)
ఏపీకి ఐదేళ్ల పాటు ప్రత్యేక హోదా ఇస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిందని, అధికారంలోకి రాగానే ఆ హామీని అమలు చేస్తుందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ స్పష్టం చేశారు. ఇదే హామీతో రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు వెళతామని వివరించారు. ఏపీకి ప్రత్యేక హోదా కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని చెప్పారు. 
 
భారత్ జోడో యాత్ర చైర్మన్ గా దిగ్విజయ్ సింగ్ వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో కొనసాగుతున్న భారత్ జోడో యాత్రలో ఆయన పాల్గొన్నారు. కాంగ్రెస్ యాత్రకు హృదయపూర్వక స్వాగతం పలికిన ఏపీ ప్రజలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇవ్వడం తమకే సాధ్యమని తేల్చిచెప్పారు. 
 
తెలంగాణ విషయంలో హామీని నిలబెట్టుకున్నామని, ఏపీకి ఇచ్చిన హామీలను కూడా నిలబెట్టుకుంటామని డిగ్గీరాజా తెలిపారు. ఈ విషయంలో బీజేపీ పార్టీ, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఆంధ్రులను మోసం చేశారని దిగ్విజయ్ ఆరోపించారు. రాష్ట్రానికి పదేళ్ల పాటు ప్రత్యేక హోదా కల్పిస్తామని ఇచ్చిన హామీని బీజేపీ నిలబెట్టుకోలేదని విమర్శించారు.
 
భారత్ జోడో యాత్ర తెలంగాణలోకి ప్రవేశించాక ప్రత్యేక రాష్ట్రం ఎందుకు ఇచ్చామనే విషయం స్వయంగా రాహుల్ గాంధీనే చెబుతారని దిగ్విజయ్ వివరించారు. తెలంగాణ దాటితే మిగతా రాష్ట్రాల్లో టీఆర్ఎస్, బీఆర్ఎస్ పార్టీ ప్రభావం ఎక్కడుందని ప్రశ్నించారు.  

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు