ఆంధ్రప్రదేశ్‌లో 37 లక్షల మంది మహిళల సెల్ ఫోన్లలో దిశ యాప్ అందుబాటులో ఉందని రాష్ట్ర హోం శాఖ మంత్రి సుచరిత చెప్పారు. ఏపీలో ఇప్పటికే దిశ యాప్ బాగా ప్రాచుర్యాన్ని పొందిందని, దీని ద్వారా ఆడవాళ్లకు సత్వర రక్షణ, న్యాయం జరుగుతున్నాయన్నారు.
కృష్ణా జిల్లా నందిగామలో స్నేహ క్లబ్ ఆధ్వర్యంలో సినీ గేయ రచయిత కళాప్రపూర్ణ డాక్టర్ జాలాది రాజారావు 90వ జయంతి వేడుకల్లో హోం మంత్రి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా సుచరితతో పాటు మాజీ హోం మంత్రి వసంత నాగేశ్వరరావు, ఎమ్మెల్యే మొండితోక జగన్మోహనరావు, ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ మొండితోక అరుణకుమార్ పాల్గొన్నారు. వక్తలు జానపద జలనిధి జాలాది అని కొనియాడారు.
అనంతరం హోం మంత్రి సుచరిత మీడియాతో మాట్లాడుతూ, మూడున్నర లక్షల మంది మహిళలు ఇప్పటికి దిశ యాప్ ద్వారా సహాయం కోసం పోలీసులకు ఫోన్ కాల్ చేశారని చెప్పారు. గతంలో పోలీస్ స్టేషన్ కి వస్తేనే గాని, ఫిర్యాదు చేయడానికి కూడా వీలులేని పరిస్థితుల్లో మహిలలు ఉండేవారని వివరించారు.
ఇపుడు దిశ యాప్ వచ్చాక తక్షణ న్యాయం, రక్షణ మహిలలకు లభిస్తున్నాయని చెప్పారు. కేసుల సంఖ్య కూడా అందుకే పెరుగుతోందని, దిశకు ఫోన్ చేసి సహాయం కోరిన అందరికీ తక్షణం పోలీసులు స్పందించి సహకరిస్తున్నారని హోం మంత్రి చెప్పారు. అలాగే, ఏపీలో 14 వేల మంది మహిళా పోలీసులు కొత్తగా వచ్చారని, వారందరి సహకారంతో గ్రామ గ్రామాన మహిళలకు రక్షణ కల్పిస్తున్నామన్నారు.