హైదరాబాద్‌లోని ఆయన నివాసం నుంచి ఆన్‌లైన్ ద్వారా విలేకరుల సమావేశంలో మాట్లాడిన ఆయన 'ప్రజాతీర్పు మూడు రాజధానులకు అనుకూలంగా ఉంటే మేం స్వాగతిస్తాం. నా సవాల్‌ను స్వీకరిస్తారా?' అని ప్రశ్నించారు. రాజధాని సమస్య ఏ ఒక్కరిదో, ఒక్క పార్టీదో కాదని, ఐదు కోట్ల ఆంధ్రులదని అన్నారు. ఎన్నికలకు ముందు మూడు రాజధానుల విషయం ప్రజలకు ఎందుకు చెప్పలేదని ప్రశ్నించారు.
అధికారంలోకి వచ్ని తరువాత మూడురాజధానులు చేస్తామనడం సరికాదు. ఇది ప్రజలకు వెన్నుపోటు పొడవడం, మోసం చేయడమే' అని అన్నారు. అమరావతి రాజధాని విషయంలో రైతులకు అండగా నిలుస్తామని, ఒక వైపు న్యాయపోరాటం. మరో వైపు ప్రజాపోరాటం చేస్తామని అన్నారు. ప్రజలను నమ్మించి మోసం చేసిన వైసిపిని ప్రజాకోర్టులో దోషులుగా నిలబెట్టేందుకు ప్రతి ఒక్కరూ కలిసి రావాలన్నారు.
జగన్ పరిపాలన తీరు పిచ్చి తుగ్గక్ పాలనలాగా ఉందని పేర్కొన్నారు. ఇప్పటికే న్యాయస్థానాలు 70 సార్లు మొట్టికాయలు వేసినా లోపాలను సరిదిద్దుకోవడం లేదని, దీనిని ఏమంటారని అన్నారు. అసెంబ్లీలో వైసిపి, టిడిపి సభ్యులు మాత్రమే ఉన్నారని, మిగిలిన రాజకీయపార్టీలు కూడా ప్రభుత్వాన్ని రాజీనామా చేయాలని డిమాండ్ చేయాలని పిలుపునిచ్చారు.