ఆగస్టు 15న రాష్ట్ర వ్యాప్తంగా ఇళ్ల స్థలాల పంపిణీ: జగన్‌

మంగళవారం, 28 జులై 2020 (22:52 IST)
స్పందన కార్యక్రమంలో భాగంగా జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం వైయస్‌ జగన్‌ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. కోవిడ్‌–19, సీజనల్‌ వ్యాధులు, పేదలకు ఇళ్ల స్థలాల పట్టాలు, ఇసుక సరఫరా, వ్యవసాయం, ఉపాధి హామీ పనులు, పాఠశాలల్లో నాడు–నేడు కార్యక్రమాలు, పనులను కాన్ఫరెన్సులో సీఎం సమీక్షించారు.
 
అమరావతిలోని క్యాంప్‌ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆదిమూలపు సురేష్,  సీఎస్‌ నీలం సాహ్ని, డీజీపీ గౌతమ్‌ సవాంగ్, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
 
రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా
రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా నిరుపేదల ఇళ్ల స్థలాల కోసం మొత్తం రూ.22,355 కోట్లు ఖర్చు చేస్తున్నామని, మొత్తం 30 లక్షల పేద కుటుంబాలకు ఇళ్ల స్థలాల పట్టాలు ఇవ్వబోతున్నామని సీఎం వైయస్‌ జగన్‌ ప్రకటించారు. ఇందు కోసం మొత్తం 66,842 ఎకరాల భూముల్లో ఇళ్ల స్థలాలు లేఅవుట్‌ చేశామని ఆయన వెల్లడించారు.

రాష్ట్రంలో ఏనాడూ ఈ స్థాయిలో ఇళ్ల స్థలాలు ఇవ్వలేదని, ఈ ప్రభుత్వం కూడా ఇంత ఖర్చు చేయలేదని తెలిపారు. మంచి పనికి దేవుడు ఎప్పుడూ సహకరిస్తాడన్న ఆయన, సుప్రీంకోర్టులో న్యాయం జరుగుతుందన్న నమ్మకం ఉందని చెప్పారు.
 
ఎంత భూమి, ఎంత వ్యయం:
రాష్ట్రంలో ఇప్పుడు రూ.22,355 కోట్ల విలువైన 66,842 ఎకరాల భూములను ప్లాట్లుగా అభివృద్ధి చేసి 30 లక్షల నిరుపేద కుటుంబాలకు పట్టాలతో సహా ఇవ్వబోతున్నామని సీఎం వైయస్‌ జగన్‌ వెల్లడించారు.

వాటిలో రూ.7,700 కోట్ల విలువైన 25,462 ఎకరాల ప్రభుత్వ భూములు ఉండగా, రూ.9,200 కోట్ల విలువైన 23,262 ఎకరాల ప్రై వేటు భూములు, రూ.1350 కోట్ల విలువైన 4,457 ఎకరాల ల్యాండ్‌ పూలింగ్‌ భూములు, రూ.325 కోట్ల విలువైన 1,074 ఎకరాల సీఆర్డీయే భూములు,

రూ.810 కోట్ల విలువైన 2,686 ఎకరాల టిడ్కో భూములతో పాటు, పొజిషన్‌ సర్టిఫికెట్ల ద్వారా సేకరించిన రూ.2,970 కోట్ల విలువైన 9,900 ఎకరాల భూములు ఉన్నాయని ముఖ్యమంత్రి వివరించారు.
 
ఆగస్టు 15న పంపిణీ:
అందుకే దేశానికి స్వాతంత్య్రం వచ్చిన రోజే రాష్ట్రంలో పేదలకూ స్వాతంత్య్రం వస్తుందని భావిస్తున్నానన్న సీఎం వైయస్‌ జగన్, ఆరోజున రాష్ట్రవ్యాప్తంగా నిరుపేద కుటుంబాలకు ఇళ్ల స్థలాల పట్టాలు పంపిణీ చేస్తామని వెల్లడించారు.

ఆ మేరకు అధికారులు సిద్ధం కావాలన్న ఆయన, ఇళ్ల స్థలాలను మహిళల పేరుతో రిజిస్ట్రేషన్‌ చేస్తామని, అన్నింటికీ పక్కా డాక్యుమెంట్లు ఇస్తామని చెప్పారు. వాటిలో స్పష్టంగా లబ్ధిదారు పేరు, ప్లాటు,  సరిహద్దుల వివరాలు రాయాలని, ఈ ప్రక్రియ అంతా కూడా ఆగస్టు 10 కల్లా పూర్తి కావాలని అధికారులకు నిర్దేశించారు.
 
20 శాతం కుటుంబాలకు:
రాష్ట్రంలో దాదాపు 1.50 కోట్ల కుటుంబాలు ఉండగా, ఇప్పుడు 30 లక్షల నిరుపేద కుటుంబాలకు ఇళ్ల స్థలాల పట్టాలు ఇస్తున్నామన్న సీఎం వైయస్‌ జగన్, ఆ విధంగా 20 శాతం కుటుంబాలకు లబ్ధి చేకూరుస్తున్నామని వెల్లడించారు. ఇప్పటికే 97.83 శాతం ప్లాట్ల విభజనం పూర్తయ్యిందన్న సీఎం, మిగతా వాటిని కూడా వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు.
 
ఎవరైనా మిగిలిపోతే?:
అన్ని గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్లాట్ల లబ్ధిదారుల జాబితాలను డిస్‌ప్లే అవుతున్నాయా? లేదా? అన్నది అధికారులు చెక్‌ చేయాలని సీఎం నిర్దేశించారు. ఇంకా ఎవరైనా మిగిలిపోతే, వారు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. వారికి అర్హత ఉంటే, గతంలో చెప్పిన విధంగా 90 రోజుల్లో ఇళ్ల స్థలాల పట్టాలు ఇస్తామని ప్రకటించారు.

ఇది నిరంతరం జరిగే ప్రక్రియ అన్న ముఖ్యమంత్రి, అలా వచ్చే దరఖాస్తులను పద్దతి ప్రకారం పరిశీలిస్తున్నారా? లేదా? అన్నది చూడాలని ఆదేశించారు. పెన్షన్లు, రేషన్‌ కార్డులు, ఇళ్ల స్థలాల పట్టాలపైనే అత్యధికంగా దరఖాస్తులు స్పందనలో వస్తున్నాయన్న విషయాన్ని అధికారులు గుర్తు పెట్టుకోవాలన్న ఆయన, నిర్ణయించుకున్న సమయంలోగా ఆ దరఖాస్తులను పరిష్కరిస్తున్నామో లేదో చూడాలని కోరారు.

కోవిడ్‌ పరిస్థితులు తగ్గగానే రచ్చ బండ కార్యక్రమం ద్వారా గ్రామాల్లో పర్యటిస్తానన్న సీఎం, అప్పటికల్లా అర్హులైన ప్రతి కుటుంబానికి ఇంటి స్థలం అందేలా చూడాలని కోరారు. 
 
లేఅవుట్లు–మొక్కలు:
పేదల ఇళ్ల స్థలాల పంపిణీ కోసం రాష్ట్ర వ్యాప్తంగా 19 వేల లేఅవుట్లు అభివృద్ధి చేయగా, వాటిలో 13 వేల లేఅవుట్లు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నాయని సీఎం తెలిపారు. వాటన్నింటిలో వన మహోత్సవం (జగనన్న పచ్చతోరణం)లో భాగంగా మొక్కలు నాటాలని సీఎం కోరారు. అన్ని లేఅవుట్లలో కచ్చితంగా వన మహోత్సవం కార్యక్రమం చేపట్టాలని ఆయన ఆదేశించారు.
 
ఇసుక సరఫరా:
ఆర్డర్‌ పెట్టిన 72 గంటల్లో ఇసుక డెలివరీ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని గుర్తు చేసిన సీఎం వైయస్‌ జగన్, కొన్ని చోట్ల బ్యాక్‌లాక్‌ ఉందని చెప్పారు. ముఖ్యంగా ఉభయ గోదావరి, గుంటూరు జిల్లాలలో ఆ బ్యాక్‌లాక్‌ ఉందని, అందువల్ల వెంటనే స్పెషల్‌ డ్రైవ్‌ చేపట్టి రెండు మూడు మొత్తం క్లియర్‌ చేయాలని, ఆ విధంగా ఆర్డర్‌ చేసిన 72 గంటల్లోగా ఇసుక అందేలా చూడాలని కోరారు.

వర్షాకాలంలో పనుల కోసం 52.5 లక్షల టన్నుల ఇసుక అందుబాటులో ఉందన్న సీఎం, అవకాశం ఉన్న చోట ఇంకా ఇసుక తవ్వి నిల్వ చేయాలని ఆదేశించారు. వర్షాలు మరింత ఊపందుకుని రీచ్‌లు మునిగిపోయే పరిస్థితులు వస్తాయి కాబట్టి.. ఎక్కడెక్కడ అవకాశం ఉందో... అక్కడ రీచ్‌లు ప్రారంభించి ఇసుక నిల్వలు పెంచాలని నిర్దేశించారు.
 
ఉపాధి హామీ పనులు (ఎన్‌ఆర్‌ఈజీపీ):
గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, వైయస్సార్‌ రూరల్‌ హెల్త్‌ క్లినిక్స్, వైయస్సార్‌ అర్బన్‌ హెల్త్‌ క్లినిక్స్‌ పనులు ఊపందుకోవాలన్న ముఖ్యమంత్రి, దీనిపై జాయింట్‌ కలెక్టర్లు ప్రతి రోజూ సమీక్షించాలని కోరారు. అలాగే కలెక్టర్లు కూడా రెండు రోజులకు ఒకసారి (రోజు విడిచి రోజు) వాటి నిర్మాణాలపై దృష్టి పెట్టాలని పేర్కొన్నారు.

వాటి నిర్మాణం కోసం ఇంకా పలు చోట్ల స్థలాలు గుర్తించాల్సి ఉందన్న సీఎం, కలెక్టర్లు వెంటనే ఆ పని పూర్తి చేయాలని ఆదేశించారు. కోవిడ్‌ లాంటి విపత్తులను ఎదుర్కోవాలంటే వైయస్సార్‌ రూరల్, అర్బన్‌ హెల్త్‌ క్లినిక్స్‌ చాలా అవసరం అని, అందువల్ల వాటిపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని కోరారు. అదే విధంగా కొత్త మెడికల్‌ కాలేజీల నిర్మాణం కోసం స్థలాల గుర్తింపును కూడా వెంటనే పూర్తి చేయాలని నిర్దేశించారు.
 
నాడు–నేడు (మనబడి):
ఈ ఏడాది సెప్టెంబరు 5న స్కూళ్లు ప్రారంభం కానున్న నేపథ్యంలో స్కూళ్లలో నాడు–నేడు (మనబడి) కింద చేపట్టిన అన్ని సివిల్‌ పనులు ఆగస్టు 31 నాటికి పూర్తి కావాలని సీఎం వైయస్‌ జగన్‌ ఆదేశించారు. వాటిపై ప్రతి రోజూ జేసీ రివ్యూ చేయాలని, అలాగే కలెక్టర్‌ రెండు రోజులకు ఒకసారి సమీక్ష జరపాలని కోరారు.
 
వ్యవసాయం:
రాష్ట్రంలో ఈ ఏడాది 39 శాతం అధిక వర్షపాతం నమోదైందన్న సీఎం వైయస్‌ జగన్, 10 జిల్లాలో అధికంగా, 3 జిల్లాల్లో సాధారణ వర్షం కురిసిందని తెలిపారు. ఇది చాలా మంచి పరిణామం అని ఆయన పేర్కొన్నారు.

అందువల్ల క్వాలిటీ విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు రైతు భరోసా కేంద్రాల (ఆర్బేకేల) ద్వారా అందేలా జాయింట్‌ కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని కోరారు. క్వాలిటీ విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు అందించే బాధ్యత ప్రభుత్వానిదని మాట ఇచ్చామని గుర్తు చేసిన సీఎం, ఆ మేరకు అవి సకాలంలో ఇస్తున్నారా? లేదా? అన్నది పరిశీలించాలని కోరారు.
 
ఇ–క్రాపింగ్‌:
ఇ–క్రాపింగ్‌ కోసం జాయింట్‌ అజమాయిషీ  కూడా సరిగ్గా జరుగుతుందా? లేదా? అన్నది చూడాలని, సంబంధిత జేసీలు దీనిపై దృష్టి పెట్టాలని, గ్రామ సచివాలయాల్లోని అగ్రికల్చర్‌ అసిస్టెంట్, రెవిన్యూ అసిస్టెంట్, సర్వేయర్లు ఆ ప్రక్రియ పూర్తి చేయాలని సీఎం సూచించారు. 
 
కౌలు రైతులు–రుణం:
కౌలు రైతుల కోసం తీసుకొచ్చిన సాగు ఒప్పందం అమలు చేయాలని, దాని వల్ల తమకు ఎలాంటి నష్టం జరగదని రైతులకు అవగాహన కల్పించాలని, తద్వారా కౌలు రైతులకు రుణాలు అందేలా చూడాలని కోరారు.
 
వ్యవసాయ సలహా కమిటీలు:
జిల్లా స్థాయి, మండల స్థాయి వ్యవసాయ సలహా కమిటీలు ఏర్పాటు చేశామని గుర్తు చేసిన సీఎం వైయస్‌ జగన్, ఆ కమిటీలు సమావేశాలు నిర్వహించేలా చూడాలని కోరారు. 

ఏ పంటలు వేయాలి? ఏవి వేయకూడదు? మార్కెటింగ్‌ అవకాశాలు ఏంటి? తదితర అంశాలపైన వారు చర్చించాలన్న సీఎం, ఏ పంటలు సాగు చేస్తే మంచి ధరలు వస్తాయన్న దానిపై కమిటీలకు సమాచారం అందుబాటులో ఉంచాలని సూచించారు. ఆ కమిటీల ద్వారా ఆర్‌బీకేలు, అక్కణ్నుంచి రైతులకు ఆ సమాచారం అందాలని, ఆ మేరకు తగిన చర్యలు తీసుకోవాలని నిర్దేశించారు.
 
రైతుల గ్రూప్‌ల ఏర్పాటు:
ఆర్బీకేల పరిధిలో రైతుల గ్రూపులు ఏర్పాటు కావాలన్న సీఎం, దీని వల్ల వ్యవసాయ పనిముట్లు, యంత్రాలు ఆర్బీకేలకు అందించగలుగుతామని చెప్పారు. వ్యవసాయ యాంత్రీకరణ కోసం దాదాపు రూ.1700 కోట్లు ఖర్చు చేస్తున్నామని తెలిపారు. పంటలకు వచ్చే వ్యాధుల పట్ల, తెగుళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
 
టోల్‌ఫ్రీ నెంబర్లు:
ఇక పంటల సాగులో వచ్చే కష్టనష్టాలపై తగిన సలహాలు ఇవ్వడానికి టోల్‌ఫ్రీ నంబర్‌ ఏర్పాటు చేశామన్న ముఖ్యమంత్రి, 155251 టోల్‌ ఫ్రీ నంబర్‌ ద్వారా శాస్త్రవేత్తల నుంచి రైతులకు సలహాలు, ఉత్తమ యాజమాన్య పద్ధుతులపై సమాచారం ఇస్తున్నారని, 20 మంది సైంటిస్టులను కాల్‌ సెంటర్లో పెట్టామని చెప్పారు.

అదే విధంగా ఆర్బీకేల్లో ఎలాంటి సమస్య వచ్చినా సరే.. 1902కు నివేదించవచ్చన్న సీఎం, వెంటనే ఆ సమస్యలపై అధికారులు దృష్టి సారించాలని కోరారు. కాల్‌ సెంటర్లు సరిగ్గా పని చేస్తున్నాయా? లేదా? అన్నది అధికారులు స్వయంగా ఫోన్‌ చేసి పరిశీలించాలని సీఎం వైయస్‌ జగన్‌ నిర్దేశించారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు