అలా చేయడం వల్ల రాష్ట్రానికి తలవంపులు కాదా?.. జగన్ పై యనమల ధ్వజం

గురువారం, 1 ఆగస్టు 2019 (08:20 IST)
ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి విదేశాలకు వెళ్లాలంటే కోర్టు అనుమతి పొందాల్సి రావడం రాష్ట్రానికి తలవంపులు కాదా? అని శాసనమండలి ప్రతిపక్షనేత యనమల రామకృష్ణుడు ప్రశ్నించారు. జగన్‌ తన ఫోన్‌ నెంబర్లు ఇచ్చి విదేశాలకు వెళ్లాలని కోర్టు ఆదేశించాల్సి రావడం ఏపీకి అప్రదిష్టకాదా అని ఆయన అన్నారు.

బుధవారం ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఇక రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి రూ.2లక్షలు డిపాజిట్‌ కట్టి విదేశాలకు వెళ్లమని కోర్టు చెప్పిందంటే వైసిపి నేతలు ఎటువంటి వారో అర్ధమవుతోందన్నారు. ఇటువంటి నేతల నోటి వెంట నీతులు వినాల్సి వస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

రాష్ట్ర ప్రయోజనాలు వైసిపి నేతలకు పట్టవని, పేదల సంక్షేమంపై శ్రద్ధ లేదని, నిందితుల సంక్షేమమే తప్ప పేదలు వీళ్లకు పట్టరని యనమల విమర్శించారు. అవినీతి కేసులు, కోర్టు వాయిదాలు, నిందితుల అరెస్టులు, విడుదల, జప్తులు వాటి విడుదలతోనే వైసిపి నేతలు కాలక్షేపం చేస్తున్నారని పేర్కొన్నారు. వైసిపి నేతలను చూసి రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఎవరూ ముందుకు రావడం లేదన్నారు.

పారిశ్రామిక వేత్తలు బేజారెత్తి పారిపోతున్నారని ఆరోపించారు. ఇప్పటికే కియా ఆగ్జిలరీ యూనిట్లు 17 కర్నాటక వైపు మళ్లుతున్నాయన్నారు. పిపిఎల సమీక్ష రచ్చ వల్ల ఎన్‌టిపిసి, ఇతర కంపెనీలు కోర్టుకెళ్లాయన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు