పనికిరాని వాళ్లే పార్టీని వీడుతున్నారు.. : పీసీసీ చీఫ్ రఘువీరా

ఆదివారం, 30 ఆగస్టు 2015 (13:28 IST)
కాంగ్రెస్‌ను వీడేవారంతా పార్టీకి ఏమాత్రం పనికిరానివారేనని, అందువల్ల మాజీ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్ తెలుగుదేశం పార్టీలో చేరడంలో ఎలాంటి తప్పు లేదని, పైగా అది పెద్ద విషయమేమీ కాదని ఏపీ పీసీసీ చీఫ్ ఎన్. రఘువీరా రెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ రావు ఆదివారం ఏపీ ముఖ్యమత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సమక్షంలో సైకిలెక్కిన విషయం తెల్సిందే. దీనిపై రఘువీరా స్పందిస్తూ.. డొక్కా టీడీపీలో చేరిన విషయమేమీ పెద్ద వార్త కాదంటూ ఆయన వ్యాఖ్యానించారు. చాలాకాలం నుంచి డొక్కా తమ పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉన్నారని ఆయన చెప్పుకొచ్చారు. 
 
కాగా, ఉమ్మడి రాష్ట్రంలో గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా డొక్కా మాణిక్యవరప్రసాద్ పని చేశారు. పైగా కాంగ్రెస్ పార్టీకి వీరవిధేయుడు. అంతేనా, కరడుగట్టిన కాంగ్రెస్ వాదుల్లో ఆయన ముందు వరుసలో ఉంటారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఏపీలో కాంగ్రెస్ పార్టీ తుడిచిపెట్టుకుపోయింది. ఒక్కటంటే ఒక్క అసెంబ్లీ సీటును కూడా గెలుచుకోలేకపోయింది. 
 
ఈ నేపథ్యంలో ఆ పార్టీకి చెందిన హేమాహేమీలంతా పార్టీని వీడారు. రఘువీరారెడ్డి, ఆనం రాంనారాయణరెడ్డి తదతరులు మాత్రం పార్టీని అంటిపెట్టుకుని ఉన్నారు. ఇక తమ పార్టీలో చేరమంటూ డొక్కాకు వైసీపీ ఆహ్వానం పంపింది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డిపై వల్లమాలిన అభిమానమున్న డొక్కా మాత్రం ఆ ఆహ్వానాన్ని తిరస్కరించారు. తాజాగా తన గురువు రాయపాటి సాంబశివరావు సూచన మేరకు టీడీపీలో చేరారు.

వెబ్దునియా పై చదవండి