విపత్కర వేళ పేదలకు దాతల సాయం మరువలేనిది: ఉప ముఖ్యమంత్రి
శుక్రవారం, 15 మే 2020 (23:07 IST)
విపత్కరవేళ పేదలకు దాతల సహాయం మరువలేనిదని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ బి. అంజాద్బాష పేర్కొన్నారు.
ఎర్రముక్కపల్లి 21వ డివిజన్ ఇంచార్జ్ సుబ్బరాయుడు, కార్పొరేటర్ అభ్యర్థి సుజాత, ఆధ్వర్యంలో ఉప ముఖ్యమంత్రి, మాజీ మేయర్ సురేష్ బాబు చేతుల మీదుగా కూరగాయలు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి ఎస్ బి. అంజాద్ భాష మాట్లాడుతూ కరోనా ప్రభావంతో దేశవ్యాప్తంగా లాక్ డౌన్ నిర్వహించడం జరిగిందన్నారు.
దీంతో పేదలు ఉపాధి కోల్పోయి తినడానికి తిండి లేక నానా ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఈ సమయంలో కడప పట్టణంలోని నాయకులు ఆయా ప్రాంతాలలోని పేదలకు నిత్యావసర సరుకులు కూరగాయలు, మాస్కులు, అందజేసి ఆదుకుంటున్నారన్నారు.
నేడు 21వ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థి గా పోటీచేసే మోదుకూరు సుజాత ఆధ్వర్యంలో రెండు వేల కుటుంబాలకు కూరగాయలు పంపిణీ చేయడం శుభపరిణామమన్నారు. ఈ సందర్భంగా ఏఎన్ఎం ల ప్రతిభను గుర్తించి సన్మానించడం జరిగిందన్నారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి విపత్కర సమయంలో పేదలను అన్ని విధాల ఆదుకోవాలనే ఉద్దేశంతో ఈనెల 15వ తేదీ నుంచి 4 వ విడత రేషన్ పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరుగుతుందన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేనప్పటికీ రేషన్ కార్డుదారులకు వెయ్యి రూపాయలు నగదు కూడా వాలంటీర్ల ద్వారా ఇవ్వడం జరిగిందన్నారు.
కరోనా కట్టడి లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతుందన్నారు. కరోనా పరీక్షలు నిర్వహించడంలో భారతదేశంలో మన రాష్ట్రం అగ్రగామిగా నిలిచిందన్నారు. ఇతర దేశాల నుంచి మన రాష్ట్రానికి వచ్చిన వారిని క్వారంటైన్ కి పంపి కరోనా పై తగు జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుందన్నారు.
మన రాష్ట్రంలో కరోనా కేసులు కంటే కరోనా నుంచి పూర్తిగా కోలుకుని డిశ్చార్జి చేసిన వారు ఎక్కువ మంది ఉన్నారన్నారు. కరోనా కట్టడికి జిల్లా యంత్రాంగం విశేష కృషి చేస్తుందని ఇందుకు ప్రజలు కూడా సహకరించాలన్నారు. ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించి, సామాజిక దూరం తప్పక పాటించాలన్నారు.
అత్యవసర పరిస్థితులలో తప్ప ఇంటి నుంచి ఎవరు కూడా బయటకు రాకూడదన్నారు. ఈ కార్యక్రమంలో వైయస్ఆర్ సీపీ నాయకులు నరేన్ రామాంజులరెడ్డి, మాసీమబాబు,నిత్యానంద రెడ్డి, సుధాకర్, దస్తగిరి, కృష్ణ, హరి, తదితరులు పాల్గొన్నారు.