విజయవాడ: రాష్ట్ర ప్రభుత్వం కరోనా విపత్తును ఎదుర్కొనేందుకు ముందు చూపుతో అమలు చేసిన కర్ఫ్యూ ప్రభావం రాష్ట్ర వ్యాప్తంగా ప్రభావితం చేస్తోంది. గత కొద్ది రోజులుగా వస్తున్న కరోనా కేసుల కంటే నిన్న, ఈరోజు కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టింది. రెండో దశలో మొదటి దశను మించి సుమారుగా 25 వేల కేసుల మార్క్‌ను చేరింది. ప్రభుత్వం ఎంతో సాహసంతో చేసిన ప్రయత్నం ఫలించిందని చెప్పవచ్చు.
కర్ఫ్యూ అనంతరం ఈరోజు 17,188 కేసులు మాత్రమే నమోదు కావడం శుభపరిణామం. కేసులు తగ్గుముఖం పడుతున్నాయి అనేందుకు ఈ సంఖ్య తార్కాణంగా నిలిచింది. కేసులు తగ్గుముఖం పట్టడంతో గతంలో కరోనా బారిన పడిన వ్యాధిగ్రస్తులకు నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు కూడా సమయం దొరుకుతుందని ప్రభుత్వ ఉన్నతాధికారులు పలువురు పేర్కొన్నారు.
సాధారణంగా రాష్ట్ర వ్యాప్తంగా సాయంత్రం 6 నుంచి 9 గంటలు వరకు నిర్వహించే వివిధ వ్యాపార సముదాయాలు, చిరు వ్యాపారులకు ఇతర వ్యాపార వర్గాలకు మంచి వ్యాపారం జరిగే సమయం. ఆ సమయంలోనే ఎక్కువమంది జనం ఒకేచోట గూమిగూడడం వంటి సంఘటనలు జరిగేవి. అయితే.. గత రెండు రోజులుగా రాష్ట్రంలో కర్ఫ్యూ విధించడంతో ఈ తరహా వ్యాపారాలు నిలిచిపోవడంతో పాటు జన సాంధ్రత కూడా తగ్గడం కేసులు మందగించేందుకు ప్రధాన కారణంగా భావించవచ్చు.