క్వీన్ అనుష్క శెట్టి యాక్షన్ థ్రిల్లర్ ఘాటి సినిమా సెప్టెంబర్ 5న థియేటర్లలోకి రానుంది. టీజర్, ట్రైలర్, బ్లాక్ బస్టర్ పాటలతో ఇప్పటికే సినిమా హ్యాజ్ బజ్ క్రియేట్ చేసింది. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మాణంలో, UV క్రియేషన్స్ సమర్పిస్తున్న ఈ చిత్రం ప్రమోషన్స్ ప్రస్తుతం జోరుగా జరుగుతున్నాయి. ఈ చిత్రం గురించి మంగళవారంనాడు దర్శకుడు క్రిష్ పలు విశేషాలు తెలియజేశారు.
- ఘాటి అనేది ఆంధ్ర ఒరిస్సా బోర్డర్ లోని కొండ ప్రాంతం. ఒకప్పుడు బ్రిటీషర్లు అక్కడ ప్రజలను గంజాయి రవాణాకోసం గాడిదల తరహాలో ఉపయోగించుకొనేవారు. అక్కడివారిని ఘాటీలు అంటారు. అందులో వారికి చెందిన వారే అనుష్క శెట్టి, విక్రమ్ ప్రభు. వారు తమకు జరిగిన అన్యాయాన్ని ఏవిధంగా పోరాటం చేశారనేది ఘాటి గురించి క్లుప్తంగా కథ.
- అక్కడ మాట్లాడుకునే భాష మన తరానికి చాలామందికి తెలీదు. అటువంటి అచ్చమైన తెలుగు పదాలు ఇందులో వున్నాయి. సాయి మాధవ్ బొర్రా చక్కటి సంభాషణలు రాశారు. నేను కూడా మూడు పాటలు రాశాను. చంద్రబోస్ కూడా మంచి సాహిత్యం సమకూర్చారు. అచ్చమైన తెలుగు సినిమా చూసిన ఫీలింగ్ కలుగుతుంది.
- ప్రభుత్వాలను వేలెత్తి చూపే కథ మాత్రం కాదు. ప్రజల్ని ఆలోజింపచేసేలా వుంటుంది. ఇందులో ఎటువంటి మెసేజ్ ఇచ్చామనేది చిత్రం చూసి తెలుసుకోవాల్సిందే. అనుష్క చాలా ధైర్యంగా పోరాట సన్నివేశాల్లో నటించారు.
- మేం ఒక్కో షాట్ తీయడానికి రోజుల తరబడి వేచి వుండి షూట్ చేస్తాం. అది తెరపై కొద్దిసేపే కనిపించవచ్చు. ఒక్కోసారి సీన్ బాగా పండాలని ఏడెమిదినెలలు కష్టపడతాం. అలాంటి సినిమా విడుదలైతే కనీసం ముప్పై రోజులైనా వుండడంలేదు. కాలక్రమేణా మూడు షోలకే పరిమితం అవుతున్నారు.
ఇంకా చెప్పాలంటే సినిమా విడుదలైన మూడు గంటల్లోనే సినిమా జీవితాన్ని ప్రేక్షకులు మార్చేస్తున్నారు. ఇందుకు వారిని తప్పు పట్టడంలేదు. కాలంతోపాటు వస్తున్న మార్పులుగానే భావించాలి.
- ఇక ఇటీవలే నేను దర్శకత్వం వహించి మధ్యలో వదిలేసిన హరిహర వీరమల్లు గురించి చెప్పాలంటే, అది అనుకోని కారణాలవల్ల జరిగిందే. ఇందులో ఎవరి తప్పులేదు. కథను చెప్పినప్పుడు అనుకున్న సమయానికి జరగకపోవడం ఓ భాగమైతే, కాల్షీట్స్ వల్ల సినిమా వాయిదా పడడంతో నా తదుపరి చిత్ర టీమ్ కు టైం కేటాయించలేకపోయాను.
నాకు ఎ.ఎం. రత్నం గారంటే వల్లమాలిన అభిమానం. పవన్ కళ్యాణ్ గారంటే ఎనలేని అభిమానం. అలాంటి సినిమాను పూర్తి చేయలేకపోయానే బాధ కొంచెం వున్నా పరిస్థితులు వల్ల చేయలేకపోయాను.
- నేను ఏ కథ చెప్పినా ఆర్టిస్టుల హావభావాలతో కనిపెట్టేస్తాను. అలా పవన్ కళ్యాణ్ గారు హరిహరవీరమల్లు కథ చెప్పినప్పుడు తప్పకుండా చేస్తారనిపించింది. గౌతమీ పుత్ర శాతకర్ణి కథ చెప్పేటప్పుడు బాలక్రిష్ణ గారు బాడీ లాంగేజ్వ్, చేతివేల్ళతో ఆయన అనుసరిచండంతో లీనమై పోవడం చూసి వెంటనే చేస్తారనిపించింది. అదేవిశంగా వేదం సినిమాలో అల్లు అర్జున్ కు పాత్ర కేబుల్ రాజు గురించి చెప్పగానే ఆయన ఆసక్తిని గమనించాను. అదేవిధంగా అనుష్క కూడా. ఇప్పుడు కథ చెబుతున్నప్పుడు ఆమె పూర్తిగా పాత్రలో లీనమైపోయింది. కనుక నేను ఏ సినిమా చేసినా ఆర్టిస్టుల ఎంపిక అనేది కరెక్ట్ వుంటుందని భావిస్తాను అని చెప్పారు.
- ప్రస్తుతానికి ఘాటి సినిమా మినహా ఏ చిత్రమూ చేయడంలేదు. మరికొంత సమయం తీసుకుని ఆ తర్వాత కొత్త సినిమా చేస్తానని తెలిపారు.