యావత్ దేశం మొత్తం చూపు ఆంధ్రప్రదేశ్ వేపై... నరాలు తెగే ఉత్కంఠత!!

వరుణ్

సోమవారం, 3 జూన్ 2024 (08:37 IST)
యావత్ దేశం మొత్తం చూపు ఆంధ్రప్రదేశ్ వైపు మళ్లింది. సార్వత్రిక ఎన్నికలతో పాటు అసెంబ్లీకి ఎన్నికలు జరిగాయి. ఈ ఓట్ల లెక్కింపు మంగళవారం చేపట్టనున్నారు. దీంతో ఏ ఇద్దరు కలిసినా ఆంధ్రాలో ఎవరు అధికారంలోకి వస్తారన్న విషయంపైనే చర్చ సాగుతుంది. ఫోన్లలో కూడా ఇవే చర్చలు. ఎక్కడకు వెళ్లినా ఎన్నికల ఫలితాలపై అంచనాలతో కాలం గడిచిపోతోంది. రాజకీయ పార్టీలకంటే లోతైన విశ్లేషణలతో ఎవరికి అధికారం దక్కుతుందనే అంశంపై చర్చలు జరుగుతున్నాయి. శనివారంతో సాధారణ ఎన్నికలు ముగియడంతో సాయంత్రం నుంచి ప్రసారమవుతున్న ఎగ్జిట్‌ పోల్‌ ఫలితాలను ఎంతో ఆసక్తిగా వీక్షించిన తెలుగు ప్రజలు.. ఆదివారం ఉదయం లేవగానే వార్తాపత్రికలను కూడా తిరగేసి.. గతంలో ఎగ్జిట్‌ పోల్‌ ఫలితాలు ఎంతవరకు నిజమయ్యాయి?.. ఈ సారి ఆయా సంస్థలు ఎవరికి ఎక్కువ సీట్లు వస్తాయని చెబుతున్నాయనే అంశాలపై దృష్టి సారించారు. 
 
కూటమి గెలుస్తుందని ఎంత ధీమాగా చెబుతున్నారో.. మరి కొంతమంది వైఎస్‌ఆర్‌సీపీ గెలుస్తుందని కూడా అంతే గట్టిగా చెబుతున్నారు. ఎగ్జిట్‌ పోల్స్‌లో కూడా సర్వే సంస్థలు రకరకాల లెక్కలు చెబుతుండడంతో ఒక అంచనాకు రాలేకపోతున్నారు. బెట్టింగులకు ఎవరూ సాహసించడంలేదని పలువురు పేర్కొంటున్నారు. ఆంధ్రాలోని తన మిత్రులకు ఫోను చేసి.. ఎవరు గెలుస్తారు.. ఏ పార్టీ అధికారంలోకి వస్తుందనే అంశాలపై ఆరాతీస్తూ... బెట్టింగుకు సరైన నమ్మకం లేక తికమక పడుతున్నారు. ఏ ప్రాంతం వారు ఆ ప్రాంతం వారికి ఫోను చేసి వరసలు కలుపుతూ.. ఫలితాలు ఎలా ఉండబోతున్నాయని ఆరా తీస్తున్నారు. మీ వాళ్లు అక్కడ ఉన్నారు కదా ఫోను చేసి కనుక్కోండి అంటూ నెమ్మదిగా విషయాన్ని రాబడుతూ.. బెరుకు, బెరుకుగానే పందేలు కాస్తున్నవారు కొంతమంది అయితే.. ఆలోచిస్తూ సమయం దగ్గర పడిందని ఆందోళన చెందుతున్నవారు అంతే మంది ఉన్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు