గజ రాజుల బీభత్సం... పంట పొలాలపై ఏనుగుల దాడి

శుక్రవారం, 27 మార్చి 2015 (08:15 IST)
ఏనుగులు మరోమారు పంటపొలాలపై దాడి చేశాయి. నోటికందిన ప్రతి పంటను తిని తొక్కి నాశనం చేశాయి. చిత్తూరు జిల్లా కుప్పం, పలమనేరు నియోజకవర్గంలో ఈ దాడులు కొనసాగుతున్నాయి. చిత్తూరు రైతులు పొలాలకు వెళ్లాలంటేనే భయపడుతున్నారు. వివరాలిలా ఉన్నాయి. 
 
పలమనేరు మండలం గంటా ఊరులోని పంటపొలాలపై గజరాజులు బుధ, గురువారాల్లో పంట పొలాలపై దాడిచేసి వరి, బీన్స్, టమాటా పంటలను నాశనం చేశాయి. ఇలాంటి సంఘటనలు జరగడం ఈ నెలలో ఇది నాలుగోసారి కావడం గమనించదగ్గ విషయం. గ్రామాల్లోకి ఏనుగులు ప్రవేశించడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. 
 
అటవీ అధికారులు స్పందించి ఏనుగులు గ్రామాల్లోకి రాకుండా చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. అడవుల్లో ఆహారం, నీరు దొరకకపోవడంతోనే అవి జనంలోకి వస్తున్నాయని అటవీ అధికారులు చెబుతున్నారు.

వెబ్దునియా పై చదవండి