మావోయిస్టులకు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. ఒడిశాలోని మల్కాన్ గిరి జిల్లా భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఎన్‌కౌంటర్లో 23 మంది మావోయిస్టులు మృతి చెందారు. ఆంధ్రా ఒరిస్సా సరిహద్దు (ఏవోబీ)లో మావోయిస్టుల ప్లీనరీ సమావేశాలు జరుగుతున్నట్లు సమాచారం అందడంతో గ్రేహౌండ్ పోలీసు బలగాలు నిన్నటి నుంచి కూంబింగ్ చేపట్టాయి. అయితే పోలీసులపై మావోయిస్టులు కాల్పులు జరపటంతో ప్రతిగా పోలీసులు కూడా ఎదురు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో 23 మంది మావోయిస్టులు చనిపోయినట్లు తెలుస్తోంది. ఘటనా స్థలంలో భారీ పెద్దన పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.
ఈ ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు ముఖ్య నేతలు గణేష్ అలియాస్ ఉదయ్, కిరణ్ చనిపోయినట్లు తెలుస్తోంది. గజ్జర్ల రవి అలియాస్ గణేష్ అలియాస్ ఉదయ్ గత 26 ఏళ్ళుగా అండర్‌గ్రౌండ్‌లో ఉన్నాడు. ఏపీ, ఒడిస్సాలో పనిచేస్తూ, మావోయిస్టు గ్రూపులో సెక్రటేరియేట్ మెంబర్‌గా కీలక నేతగా ఉన్నారు. ఆయనపై 20 లక్షల రూపాయల రివార్డు కూడా ఉంది. అలాగే తప్పించుకున్న మావోయిస్టుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.