తెలుగు రాష్ట్రాలను కుదిపేసిన ఈఎస్ఐ స్కామ్‌లో అరెస్టు అయిన టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి, ఎమ్మెల్యే కె.అచ్చెన్నాయుడు సోమవారం ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఈ స్కామ్‌లో అరెస్టు అయిన తర్వాత ఆయన తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. పైగా, మొలలు వ్యాధితో బాధపడుతూ వచ్చిన ఆయనకు రెండుసార్లు చికిత్స చేశారు.
ఈ క్రమంలో ఈఎస్ఐ స్కామ్‌లో రెండ్రోజుల క్రితమే హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. విజయవాడ ఏసీబీ కోర్టులో పూచీకత్తు సమర్పించి బెయిల్ పొందాలని ఆదేశించింది. అదేవిధంగా కోర్టు అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లరాదని, సాక్షులను ప్రభావితం చేయరాదని, దర్యాప్తునకు అందుబాటులో ఉండాలని కోర్టు షరతులు విధించింది.
అదేసమయంలో అచ్చెన్నాయుడికి కరోనా పాజిటివ్ రావడంతో మంగళగిరి ఎన్ఆర్ఐ ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకున్నారు. పూర్తి ఆరోగ్యంతో ఆస్పత్రి నుంచి ఆయన డిశ్చార్జ్ అయ్యారు. ఈ సందర్భంగా అచ్చెన్నకు టీడీపీ నేతలు ఆలపాటి రాజా, అశోక్ బాబు స్వాగతం పలికారు. ఆస్పత్రి నుంచి నేరుగా అచ్చెన్నాయుడు ఇంటికి బయల్దేరారు.
అరెస్టుకు ముందు, జ్యుడీషియల్ కస్టడీ సమయంలోనూ అచ్చెన్నాయుడికి రెండు మార్లు శస్త్రచికిత్స జరగడంతోపాటు కోవిడ్‌తోనూ బాధపడుతున్న విషయాన్ని కూడా హైకోర్టు పరిశీలనలోకి తీసుకుంది. కేవలం అనారోగ్య కారణాలే గాక, ఈ కేసులో డబ్బు లావాదేవీల మార్పిడి గురించి, ఆయన దోషి అని చెప్పే ఆధారాలను ప్రాసిక్యూషన్ ఇప్పటి వరకూ నిర్ధారించలేకపోయిందన్న విషయాన్ని కూడా న్యాయమూర్తి పరిగణనలోకి తీసుకున్నారు.