3 వేల మంది ప్రజలకు 30 మంది ఉద్యోగులా? తగ్లక్ పాలనలా వుంది : నాదెండ్ల

బుధవారం, 2 అక్టోబరు 2019 (13:16 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్. జగన్ మోహన్ రెడ్డి పాలనపై మాజీ ముఖ్యమంత్రి, ఇటీవల బీజేపీలో చేరిన సీనియర్ నేత నాదెండ్ల భాస్కర్ రావు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. జగన్ పాలన తుగ్లక్ పాలనలా ఉందంటూ ఎద్దేవా చేశారు. కేవలం మూడు వేల మంది జనాభాకు 30 మంది ఉద్యోగులా అంటూ ప్రశ్నించారు. 
 
ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్రంలో సచివాలయ వ్యవస్థ అవసరమా? అని ప్రశ్నించారు. ప్రతి 3 వేల మంది ప్రజలకు 30 మంది ఉద్యోగులు ఎందుకని నిలదీశారు. జగన్ పాలనలో అనుభవ రాహిత్యం స్పష్టంగా కనిపిస్తోందన్నారు. 
 
ప్రభుత్వ నిర్ణయాలు ప్రజలు చీదరించుకునేలా ఉండకూడదని సూచించారు. ఇసుక దొరక్క భవన నిర్మాణ కార్మికులు రోడ్డున పడ్డారని విమర్శించారు. అనేక నిర్మాణ కార్మికులు ఆకలితో అలమటిస్తున్నారన్నారు. పైగా, జగన్ పాలనలో ఇసుక దొరకడం గగనమైపోయిందన్నారు. కాగా, నాదెండ్ల భాస్కర్ రావు కుమారుడు నాదెండ్ల మనోహర్ జనసేన పార్టీలో కీలక నేతగా ఉన్న విషయం తెల్సిందే.  

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు