రైతు కోటయ్యను గుంటూరు పోలీసులు కొట్టి చంపారా?

శుక్రవారం, 22 ఫిబ్రవరి 2019 (12:32 IST)
గుంటూరు జిల్లాలో ఇటీవల ఓ రైతు పురుగుల మందు తాగి అత్మహత్యాయత్నానికి పాల్పడ్డారని పోలీసులు కేసు నమోదు చేశారు. కానీ, కుటుంబ సభ్యులు మాత్రం మరోలా స్పందిస్తున్నారు. తమ ఇంటి యజమానిని పోలీసులే కొట్టి చంపారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, గుంటూరు జిల్లాకు చెందిన బీసీ సామాజిక వర్గానికి చెందిన కౌలు రైతు పి.కోటేశ్వరరావు అలియాస్ కోటయ్య. ఈయనకు చెందిన తోటలో పోలీసులు కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేయాలని భావించారు. కొండవీడు ఉత్సవాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు రాక నేపథ్యంలో దీన్ని ఏర్పాటు చేయదలిచారు. ఇందుకోసం రైతు కోటయ్య నుంచి పోలీసులు అనుమతి తీసుకున్నట్టు వార్తలు వస్తున్నాయి.
 
కానీ, ఆదివారం రాత్రి తమకు అడక్కుండానే తోటలో 40 బస్సులను తిప్పడంతోపాటు మునగ, బొప్పాయి, కనకాంబరం తోటలను నాశనం చేశారని కోటయ్య ఆరోపించారు. కోటయ్య పొలంలో పోలీసులు మద్యం తాగడంతోపాటు పేకాట ఆడినట్లు తెలుస్తోంది. తన తోటలను ఎందుకు నాశనం చేశారని సోమవారం ఉదయం కోటయ్య ప్రశ్నించడంతో పోలీసులు ఆగ్రహంతో అతడిపై దాడి చేసినట్లు స్థానికులు చర్చించుకుంటున్నారు.
 
పోలీసులు కొట్టిన దెబ్బలు తగలరాని చోట తగలడంతో కోటయ్య చనిపోయాడని చెబుతున్నారు. కానీ, పోలీసులు మాత్రం ఆయన పురుగులు మందు సేవించి ఆత్మహత్య చేసుకున్నట్టుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. మరోవైపు కోటయ్య మృతిపై పోలీసులు విచారణ చేపట్టారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు