ముఖ్యమంత్రిని కూర్చోబెట్టి బట్టలూడదీస్తానంటే ఎలా? పవన్ ప్రశ్న

శుక్రవారం, 8 డిశెంబరు 2017 (14:58 IST)
రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీడీపీ ప్రభుత్వం తప్పు చేసినప్పుడు ప్రతిపక్ష పార్టీగా వైసీపీ దాన్ని నిలదీసి సమస్యను పరిష్కరించాల్సిన బాధ్యత ఉందని, అంతేగానీ, ముఖ్యమంత్రిని కూర్చోబెట్టి బట్టలూడదీస్తానంటే పనులు జరగవని విపక్ష నేత జగన్ మోహన్ రెడ్డిని ఉద్దేశించి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. 
 
శుక్రవారం ఆయన ఏపీ పర్యటనలో భాగంగా విజయవాడలో పర్యటించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన్ను ఫాతిమా విద్యార్థులు, కాంట్రాక్ట్ విద్యుత్ ఉద్యోగులు, సీపీఎస్‌పై పలువురు ఉద్యోగులు, కాంట్రాక్ట్ అధ్యాపకులు కలిశారు.
 
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్ష పార్టీ తన విధిని సరిగా నిర్వర్తిచండంలేదని, ఏదైన సమస్య ఉన్నప్పుడు, అధికారపక్షం చేయనప్పుడు.. ప్రతిపక్షం కూర్చోని ఇలా చేయాలని సూచించాలని, ప్రతిపక్షం పనే అదన్నారు. 
 
తాను ఎవరి పక్షంకాదని, ప్రజల పక్షమని పవన్ మరోమారు స్పష్టంచేశారు. టీడీపీ, బీజేపీలను నిలదీయడానికి తాను భయపడనని తేల్చిచెప్పారు. రాష్ట్ర విభజనతో ఏపీలో చాలా సమస్యలు ఉన్నాయని, అన్ని పార్టీలు బ్రైన్ గేమ్‌తో చూస్తే సమస్యలు పరిష్కారకంకావని, ఆడపడుచుల శోకాలు దేశానికి, రాష్ట్రానికి మంచిది కాదన్నారు. 
 
ఫాతిమా విద్యార్థుల సమస్యకు పరిష్కారం చూపకపోతే.. అది ఏపీ ప్రభుత్వానికి మాయని మచ్చలా మిగిలిపోతుందన్నారు. అలాగే, ప్రభుత్వం దుబారా తగ్గించి సమస్యల పరిష్కారానికి నిధులు వినియోగించాలని అన్నారు. కాంట్రాక్ట్ వ్యవస్థ రద్దుకు మూలాలను శోధించాలని పేర్కొన్నారు. కాంట్రాక్టు విద్యుత్ ఉద్యోగుల ఆవేదనను ప్రభుత్వం అర్థం చేసుకొని సత్వరమే వాళ్ల సమస్య పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ ఈ సమస్యపై అధికారపక్షాన్ని నిలదీయాలని అన్నారు.
 
అదేసమయంలో డబ్బులు లేనప్పుడు ఆడంబరాలకు వెళ్లకూడదని, ప్రజలు ఆనందంగా లేనప్పుడు ఎంత పెద్ద రాజధాని కట్టినా వృథానే అని పవన్ వ్యాఖ్యానించారు. సమస్యలను అర్థం చేసుకునే వ్యక్తి కాబట్టే చంద్రబాబుకు సపోర్ట్ చేశానని, చెప్పిన సమస్యలు విని పరిష్కరించే వ్యక్తి ఆయన అని ప్రశంసించారు. ప్రస్తుత పరిస్థితులను చూస్తుండటం వల్లే ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టడం లేదని, దానిని తన చేతగాని తనంగా భావించొద్దన్నారు. 
 
తాను చాలా నిగ్రహంగా రాజకీయాలు చేస్తున్నానని, పదునైన, బలమైన రాజకీయాలు కూడా చేయగలనని హెచ్చరించారు. తాను చేసే పనులు కొన్నిసార్లు ప్రభుత్వానికి మద్దతుగా, మరికొన్నిసార్లు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటాయని అన్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు