సినీ ఇండస్ట్రీని కుదిపేస్తున్న కాస్టింగ్ కౌచ్‌పై ప్రముఖ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ సంచలన వ్యాఖ్యలు చేశారు. సినిమా ఇండస్ట్రీకి రావాలనుకునే వారికి కాస్టింగ్ కౌచ్ పరిస్థితి ఎదురైతే చెప్పుతో కొట్టండన్నారు. సినీ పరిశ్రమలో పది శాతం మాత్రమే కాస్టింగ్ కౌచ్ ఉందని, మహిళల రక్షణ కోసం వారంలో కాష్ కమిటీని ప్రకటిస్తామన్నారు. గతంలో ఇంతకుమించి అరాచకాలు జరిగినా అరికట్టామని పేర్కొన్నారు.
ఇక పవన్‌పై ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని, ఇది సరైన పద్దతి కాదన్నారు. ఏపీకి సినీ పరిశ్రమ రావడానికి కొంత సమయం పడుతుందని.. శుక్రవారం సీఎం దీక్షకు సినీ పరిశ్రమ మద్దతును తెలుపుతుందని ప్రకటించారు. ప్రత్యేక హోదా కోసం ఏపీలోని అన్ని పార్టీలు కలిసి పోరాడాలని తమ్మారెడ్డి పిలుపునిచ్చారు. హోదా ఇస్తామంటూ తొలుత హామీ ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం ఆ తర్వాత ఎందుకు వెనకడుగు వేసిందో అర్థం కావట్లేదన్నారు.
14వ ఆర్థిక సంఘం ప్రత్యేక హోదాకు ఒప్పుకోవడం లేదంటూ తప్పుడు సమాచారం ఇచ్చే ప్రయత్నం చేశారని... ప్రత్యేక హోదాకు తాము అడ్డంకి కాదని సాక్షాత్తు ఆర్థిక సంఘం ఛైర్మన్ చెప్పారని తమ్మారెడ్డి గుర్తు చేశారు. ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అన్నారు. వచ్చే ఐదేళ్లలో ఏపీకి తెలుగు సినీ పరిశ్రమ వస్తుందని తాను భావిస్తున్నానని.. అమరావతికి ఇండస్ట్రీని తరలించాలని ఇంతవరకు ఎవ్వరూ పిలవలేదన్నారు.