వైఎస్ వివేకా హత్య కేసులో కీలక పరిణామం.. ఒకేసారి కోర్టుకు ఐదుగురు నిందితులు

ఆదివారం, 5 ఫిబ్రవరి 2023 (13:04 IST)
మాజీ మంత్రి, వైకాపా నేత వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఐదుగురు నిందితులను సీబీఐ ఒకేసారి కోర్టులో ప్రవేశపెట్టనుంది. ఇది చర్చనీయాంశంగా మారింది. వివేకా హత్య కేసు విచారణను సీబీఐ వేగవంతం చేసిన విషయం తెల్సిందే. ఈ విచారణలో భాగంగా, ఐదుగురు నిందితులను హైదరాబాద్ సీబీఐ కోర్టులో హాజరుపరచనున్నారు. ఈ కేసు విచారణ ఏపీ నుంచి హైదరాబాద్ నగరానికి బదిలీ అయిన తర్వాత ఐదుగురు నిందితులను ఒకేసారి పిలవడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.
 
ఇందుకోసం కడప కేంద్ర కారాగారంలో ఉన్న ముగ్గురు నిందితులకు ప్రొడక్షన్ వారెంట్ జారీకాగా, బెయిలుపై ఉన్న మరో ఇద్దరికీ సీబీఐ నుంచి సమన్లు అందాయి. కడప జైలులో రిమాండ్ ఖైదీలుగా సునీల్ యాదవ్, ఉమాశంకర్ రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్ రెడ్డిలు ఉండగా, బెయిలుపై ఎర్ర గంగిరెడ్డి, వైఎస్ వివేకా కారు డ్రైవర్ దస్తగిరి ఉన్నారు. వీరు కడప నుంచి ఈ నెల 9వ తేదీన బయలుదేరి పదో తేదీ ఉదయం 10.30 గంటలకు హాజరుకానున్నారు. కడప నుంచి గట్టి భద్రత మధ్య హైదరాబాద్ నగరానికి తరలించాలని సీబీఐ అధికారులు ఏఆర్ పోలీసులను కోరారు.
 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు