రైతులు సుఖంగా ఉంటే దేశం సుఖంగా ఉంటుందని, రైతులకు అండగా రైతు సంక్షేమం కోసం వైఎస్సార్సీపీ ప్రభుత్వం పనిచేస్తుందని దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. రైతు సంక్షేమం కోసం తలపెట్టిన మహాపాదయాత్ర పోస్టర్‌ను దేవదాయశాఖ మంత్రి శ్రీనివాస్ ఆదివారం బ్రాహ్మణ వీధి లోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2008 నుంచి రైతుల సంక్షేమం కోసం మహాపాదయాత్ర నిర్వహిస్తున్న శ్రీ గోవింద నామ ప్రచార సేవా సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు టి. సునితా మాధవన్ దంపతులను అభినందించారు. లోకకళ్యాణార్థం రైతు సంక్షేమం కోసం తలపెట్టిన రైతు మహాపాద్రయాత్ర అందరు విజయవంతం చేయాలని పిలుపు నిచ్చారు. మహాపాదయాత్ర ఆగస్టు 11వ తేదీ ఆదివారం ఉదయం ఎనిమిది గంటలకు విజయవాడ కనకదుర్గమ్మ ఇంద్రకీలాద్రి నుంచి బయలుదేరి పాదయాత్రగా మంగళగిరి లక్ష్మీ నరసింహస్వామి కొండ వరకు జరుగుతుందన్నారు.
అనంతరం మంగళగిరి పానకాల నరసింహ స్వామి వారికి కోటి తులసి దశాలతో అభిషేకం, అర్చన, 108 బిందెలతొ స్వామి వారికి పానకం సమర్పించడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో నాయకులు అప్పాజీ, శ్రీ గోవింద నామ ప్రచార సేవా సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు టి. సునితా మాధవన్, అరసవిల్లి శివ, ఎం.సాయి, ఫణికుమార్, మెహన్,శ్రీ గోవింద నామ ప్రచార సేవా సంఘం సభ్యలు, తదితరులు పాల్గొన్నారు.