రోజుకు 500 సిలిండర్లను ఆస్పత్రులు కోరుతున్నవి. డి.ఆర్.డి.వోతో కలిసి 40 ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంట్ల ఏర్పాటుకు ఎంఈఐఎల్ సిద్ధమైంది. ఒక్కొక్క ప్లాంటు నిమిషానికి 150 నుంచి 1000 లీటర్ల ఉత్పత్తి సామర్థ్యం. భద్రాచలం ఐ.టి.సి నుంచి క్రయోజనిక్ ఆక్సిజన్ దిగుమతి. స్పెయిన్ నుంచి క్రయోజనిక్ ఆక్సిజన్ దిగుమతికి ఎంఈఐఎల్ అంగీకారం. క్రయోజనిక్ ఆక్సిజన్ ట్యాంకుల తయారీకి ఎంఈఐఎల్ సంసిద్ధత తెలిపింది.
హైదరాబాద్‌లోని ప్రఖ్యాత నిమ్స్, అపోలో, సరోజినిదేవి వంటి ఆస్పత్రుల నుంచి ఆక్సిజన్ అందించవలసిందిగా మేఘా ఇంజనీరింగ్ కంపెనీకి అభ్యర్థనలు వచ్చాయి. అడిగిందే తడవుగా మేఘా ఇంజినీరింగ్ సంస్థ ఆక్సిజన్ సిలిండర్లను భారీ స్థాయిలో ఉచితంగా సరఫరా చేయాలని నిర్ణయం తీసుకున్నది.
ఇక అపోలో హాస్పిటల్స్‌కు ప్రతిరోజు 100 సిలిండర్లు, కేర్ హైటెక్‌కు 50 సిలిండర్లను 'మేఘా' సరఫరా చేయనుంది. ఇక భవిష్యత్తులో ఆసుపత్రుల నుంచి వచ్చే ఆక్సిజన్ విజ్ఞప్తి మేరకు సరఫరా చేసేందుకు ఉత్పత్తి, సరఫరా వ్యవస్థను మెరుగుపరిచేందుకు 'మేఘా ఇంజనీరింగ్' యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టింది.
డి.ఆర్.డి.వో టెక్నాలజీ సహకారంతో మేఘా ఇంజనీరింగ్ సంస్థ 30 నుంచి 40 ఆక్సిజన్ ప్లాంట్లను ఏర్పాటు చేస్తోంది. ఒక్కొక్క ప్లాంటు నుంచి నిమిషానికి 150 నుంచి 1000 లీటర్ల ఆక్సిజన్ ను ఉత్పత్తి చేయనున్నారు.ఈ మొత్తాన్ని డి.ఆర్.డి.వో కల్నల్ బి.ఎస్. రావత్, డా. రాఘవేంద్ర రావు పర్యవేక్షించనున్నారు. డీఆర్డీవో సహకారంతో 'మేఘా ఇంజనీరింగ్' కంపెనీ 3.50 లక్షల లీటర్ల ఆక్సిజన్ ను సరఫరా చేయనుంది.