"ఇంటింటికి రేషన్ పథకం" కొత్తదా.. పాతదా? ఆరా తీస్తున్న నిమ్మగడ్డ

గురువారం, 28 జనవరి 2021 (13:53 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. దీంతో ప్రభుత్వం కొత్తగా పథకాలు ప్రారంభించకూడదన్న ఆంక్షలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇటీవల ఏపీ ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి ఇంటింటికే రేషన్ పథకాన్ని ప్రారంభించారు. దీనిపై ఏపీ రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనరు నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆరా తీశారు. 
 
కోడ్ అమలులోకి వచ్చిన నేపథ్యంలో ఇది కొత్త పథకమా? లేక పాత పథకమా? అన్న విషయమై వివరణ ఇవ్వాలని ఎస్ఈసీ, పౌర సరఫరాల అధికారులను వివరణ కోరింది. దీనిపై వెంటనే వివరణ పంపిన అధికారులు, ఈ పథకాన్ని సెప్టెంబర్ 2019లోనే పైలట్ ప్రాజెక్టు కింద శ్రీకాకుళం జిల్లాలో ప్రారంభించినందున ఇది పాత పథకమేనని స్పష్టం చేశారు.
 
ఇదేసమయంలో రేషన్ సరకులను డోర్ డెలివరీ చేస్తున్న వాహనాలపై సీఎం వైఎస్ జగన్ ఫొటో స్టిక్కర్లు ఉండటంపై వివరణ కోరగా, అవి కనిపించకుండా స్టిక్కర్లు అతికిస్తున్నామని అధికారులు వివరణ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. 
 
అయితే, కొత్త పథకాలు, ప్రభుత్వం తరపున ప్రకటనలు ఇవ్వాలంటే తమ అనుమతి తప్పనిసరని, ఇదేసమయంలో పాత పథకాలను మాత్రం కొనసాగించ వచ్చని ఎస్ఈసీ స్పష్టం చేసింది.
 
కాగా, శుక్రవారం నుంచి ఏపీలో తొలి దశ పంచాయతీ ఎన్నికల ప్రక్రియ ప్రారంభంకానుంది. ఈ నెల 31 వరకూ తొలి దశ ఎన్నికలకు సంబంధించి నామినేషన్స్ దాఖలుకు అవకాశం ఉంటుంది. ఆపై ఫిబ్రవరి 1న నామినేషన్ల పరిశీలన, 9న పోలింగ్ జరుగనుంది. అదే రోజున ఓట్ల లెక్కింపు, ఫలితాలు వెల్లడి కానున్నాయి. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు