అనంతపురం నుంచి గుంటూరు వరకు హైవే

గురువారం, 8 ఏప్రియల్ 2021 (11:44 IST)
అనంతపురం నుంచి గుంటూరు వరకు జాతీయ రహదారి-544డిని విస్తరించేందుకు భూసేకరణతో కలిపి రూ.9వేల కోట్ల మేర వ్యయమవుతుందని భారత జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ(ఎన్‌హెచ్‌ఏఐ) అంచనా వేసింది.

అనంతపురం నుంచి తాడిపత్రి, కొలిమిగుండ్ల, బనగానపల్లె, గిద్దలూరు, కంభం, వినుకొండ, నరసరావుపేట మీదగా గుంటూరు వరకు 417 కి.మీ. మేర ఈ రహదారి ఉంది. ఇందులో గిద్దలూరు నుంచి వినుకొండ వరకు 112 కి.మీ. మేర ఓ ప్యాకేజీలో నాలుగు వరుసలుగా విస్తరణ పనులు ముగింపు దశకు వచ్చాయి.

మిగిలిన అనంతపురం-బుగ్గ, బుగ్గ-గిద్దలూరు, వినుకొండ-గుంటూరు మధ్య మూడు ప్యాకేజీలకు డీపీఆర్‌లు సిద్ధం చేయాలని ఎన్‌హెచ్‌ఏఐ ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వచ్చాయి. వీటిలో అనంతపురం-బుగ్గ మధ్య రాష్ట్ర ప్రభుత్వ నిధులతో గతంలో నాలుగు వరుసలుగా విస్తరించారు.

దీనిని ఎన్‌హెచ్‌ఏఐ ప్రమాణాలతో తాజాగా అభివృద్ధి చేయనున్నారు. బుగ్గ-గిద్దలూరు మధ్య వాహన రద్దీపై అధ్యయనం చేసి, దానినిబట్టి రెండు గానీ, నాలుగు వరుసలుగా గానీ విస్తరణకు డీపీఆర్‌ సిద్ధం చేస్తారు. వినుకొండ నుంచి నరసరావుపేట మీదగా గుంటూరు వరకు 90 కి.మీ. రహదారిని నాలుగు వరుసలుగా విస్తరిస్తారు.

ఈ మూడు ప్యాకేజీల డీపీఆర్‌ల తయారీకి టెండర్లు పిలిచి, సలహా సంస్థ(కన్సల్టెన్సీ)లకు బాధ్యతలు అప్పగించనున్నట్లు ఎన్‌హెచ్‌ఏఐ అధికారులు తెలిపారు.
 
కర్నూలు జిల్లా నుంచి గుంటూరు, విజయవాడ చేరుకునేందుకు కీలకమైన కర్నూలు-దోర్నాల జాతీయ రహదారి-340డిని నాలుగు వరుసలుగా విస్తరించేందుకు ఎన్‌హెచ్‌ఏఐ సిద్ధమైంది.

కర్నూలు నుంచి నందికొట్కూరు, ఆత్మకూరు మీదగా దోర్నాల వరకు 131 కి.మీ. రహదారి విస్తరణకు రూ.1,834 కోట్లు వ్యయమవుతుందని ప్రాథమికంగా అంచనా వేశారు.

దీనికి కూడా డీపీఆర్‌ తయారీకి టెండర్లు పిలవనున్నారు. తర్వాత దశలో దోర్నాల నుంచి కుంట వద్ద ఎన్‌హెచ్‌-544డిలో కలిసేలా మిగిలిన భాగం కూడా విస్తరించేందుకు వీలుందని అధికారులు చెబుతున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు